Mark Wood : ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల వుడ్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. గత కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న అతడు.. వైద్యుల సూచనల మేరకు టెస్టులు, వన్డేల్లో ఇక ఆడటం సాధ్యం కాదని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలిచిన వుడ్.. తన కెరీర్‌లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసే పేసర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన మార్క్ వుడ్.. 38 టెస్టుల్లో 119 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ తరఫున నాలుగు యాషెస్ సిరీస్‌లలో కూడా అతడు ఆడాడు. 2015లో తన తొలి యాషెస్ సిరీస్‌లోనే ట్రెంట్ బ్రిడ్జ్‌లో కీలకమైన వికెట్ తీసి ఇంగ్లండ్‌కు యాషెస్‌ను తిరిగి సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 2023 యాషెస్‌లో హెడింగ్లీలో వుడ్ వేసిన అద్భుతమైన స్పెల్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో అతడి బౌలింగ్ ఇంగ్లండ్‌ను 2-0 వెనుకబడిన స్థితి నుంచి సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకునే దిశగా తీసుకెళ్లింది.

2019లో ఇంగ్లండ్ సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో మార్క్ వుడ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో 18 వికెట్లు తీసిన అతడు గంటకు 95 మైళ్లకు పైగా వేగంతో బంతులు విసిరి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నప్పటికీ తన పూర్తి వేగంతో బౌలింగ్ చేయడం అతడి దేశం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా వుడ్ తన సత్తా చాటాడు. ఇంగ్లండ్ ప్రపంచకప్ విజయంలో భాగంగా నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 38 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వుడ్ మొత్తం 54 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ పురుషుల టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో 70 మ్యాచ్‌లు ఆడి 80 వికెట్లు సాధించాడు.

Also Read : సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ విచారణకు కోర్టు ఆదేశం!

రిటైర్మెంట్ సందర్భంగా మార్క్ వుడ్ తన భావాలను పంచుకున్నాడు. గత ఏడాది కాలంగా తాను గాయాల నుంచి కోలుకుని మళ్లీ ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు ఎంతో ప్రయత్నించానని చెప్పాడు. గాయాలను అధిగమించి తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఇంతకాలం ముందుకు సాగానని, కానీ ఈసారి మాత్రం పరిస్థితులతో పోరాటంలో తాను ఓడిపోయానని తెలిపాడు. వైద్యుల సూచనల ప్రకారం టెస్టు, 50 ఓవర్ల క్రికెట్ ఆడటం ఇక సాధ్యం కాదని, దీంతో గత ఏడాది కాలంగా ఇంగ్లండ్ తరఫున ఆడాలనే తన కల క్రమంగా దూరమైందని వుడ్ భావోద్వేగంగా చెప్పాడు. ఇంగ్లండ్ తరఫున ఆడటం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని మార్క్ వుడ్ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించడం, ఎంతో మంది గొప్ప వ్యక్తులను కలవడం, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి, వారిపై క్రికెట్ ఆడటం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. చిన్నతనంలో ఇంగ్లండ్ తరఫున ఇంతకాలం ఆడతానని కలలు కన్నానని, ఆ కల నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ కూడా మార్క్ వుడ్ సేవలను కొనియాడాడు. అతడి కెరీర్ చివరి దశను దగ్గరగా చూడటం తనకు ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. యాషెస్ విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగమైన వుడ్.. బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడని ప్రశంసించారు. ఇలాంటి కెరీర్‌ను చాలా కొద్దిమంది ఆటగాళ్లు మాత్రమే సాధిస్తారని, ఇంగ్లండ్ క్రికెట్‌కు చేసిన సేవలను మార్క్ వుడ్ ఎంతో గర్వంగా గుర్తు చేసుకోవచ్చని రాబ్ కీ అన్నారు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్‌లో వేగానికి మరో పేరు అయిన మార్క్ వుడ్ అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. గాయాలు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ప్రతిసారీ పుంజుకుని జట్టులోకి వచ్చిన వుడ్.. రెండు ప్రపంచకప్ విజయాలు, యాషెస్ సిరీస్‌లలో కీలక ప్రదర్శనలతో ఇంగ్లండ్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Also Read : AI మన మెదడును వీక్ చేస్తోందా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.