
The Paradise : నాచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్ సినిమాకు ఆదిలోనే అవంతరాలు ఎదురువుతున్నాయి. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ప్రీమియర్ షో ప్రదర్శనకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే ఆ మెమోను పునః పరిశీలించి వెనుకకు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఐపీఎస్ శిఖా గోయెల్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
కాగా, నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 14న జీవో నంబర్ 77 జారీ చేసింది. అయితే అందులో ఉన్న షరతులు 8, 9, 10, 11లకు విరుద్ధంగా ప్రస్తుత మెమో ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. నూతన జీవో ప్రకారం రూ.100 కోట్లకుపైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు, అది కూడా కార్మికుల సంక్షేమానికి నిధులు డిపాజిట్ చేస్తేనే రేట్ పెంపు అవకాశం ఇవ్వాలని షరతులు ఉన్నాయని, అలాంటిది వాటిని పాటించినట్లు ఆధారాలు ఏవీ లేకుండానే ‘ది ప్యారడైజ్’ సినిమాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది,
టికెట్ ఒక్కంటికి రూ.500 చొప్పున ఈనెల 23వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ప్యారడైజ్ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఈ అంశంపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారించింది. టికెట్ రేట్లు పెంచాలంటే చట్ట ప్రకారం సినిమా విడుదలకు 90 రోజుల ముందే సదరు ప్రతిపాదనను పబ్లిక్ డొమైన్ లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.. ప్రజలకు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబట్టింది.
Also Read : సోషల్ మీడియానే కాపురాలు కూలుస్తోంది.. కాజల్ సంచలన కామెంట్స్
ఈ నేపథ్యంలో ‘‘ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఈనెల 20న జారీ చేసిన మెమో.. చట్టంతోపాటు ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉంది. అయితే కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఎలాంటి ఆదేశాలివ్వలేం అని పేర్కొంది. ఈనెల 24న విడుదల కానున్న ప్యారడైజ్ సినిమా టికెట్ ధరల పెంపు మెమోను పునస్సమీక్షించండి. ఉపసంహరించుకునే విషయాన్ని హోంశాఖ ముఖ్యకార్యదర్శి విచక్షణకే వదిలేస్తున్నాం’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తదు పరి విచారణను అక్టోబరు 6కు వాయిదా వేసింది.
మరోవైపు ది ప్యార డైజ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. 23న స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం.. ప్రీమియర్ షో టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ రూ.400, సింగిల్ స్క్రీన్‌లో రూ.300కు విక్రయించుకోవడానిక అవకాశం ఉంది. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3 వరకూ పది రోజులపాటు ప్రస్తుత టికెట్ ధరపై మల్టీప్లెక్స్ లలో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 పెంచుకోవడానికి అవకాశం ఉంది. పది రోజుల వరకూ ప్రతి రోజూ ఐదు షోల ప్రదర్శనకు హోం శాఖ వెసులుబాటు కల్పించడం విశేషం
ప్రేక్షకులతో సినిమా చూడడానికి. అనుమతివ్వండి…నాని
తాను నటించిన ‘ప్యారడైజ్’ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతి ఇవ్వాలని కథానాయకుడు నాని… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను ఎక్స్ వేదికగా కోరారు. ‘ప్రభుత్వం సూచించిన అన్ని నిబంధనలు, భద్రతా చర్యలను పాటిస్తాం. నా అభ్యర్థనను పరిశీలించగలరు’ అని నాని తన పోస్ట్‌లో కోరడం గమనార్హం.
Also Read : పీరియడ్స్ అబ్బాయిలకు కూడా వస్తే బాగుండు.. శ్రుతిహాసన్ సంచలన కామెంట్స్









