Trump Signs Bill Allowing 100% Tariffs On India
Trump Signs Bill Allowing 100% Tariffs On India

భారత్-అమెరికా సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా కొత్త వార్నింగ్ ఇచ్చింది. రష్యా ఇంధన రంగంపై మరిన్ని ఆంక్షలు విధించే చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో భారత్, చైనా వంటి దేశాలు ఉండటంతో ఇప్పుడు ఈ చట్టం ప్రభావం ఎలా ఉంటుందన్నదే చర్చగా మారింది. ముఖ్యంగా భారత్‌పై 100 శాతం సుంకం పడే అవకాశం ఉందా? భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపాల్సిన పరిస్థితి వస్తుందా? అసలు ఈ చట్టంలో ఏం ఉంది? ఈ స్టోరీలో స్పష్టంగా తెలుసుకుందాం.

ట్రంప్ సంతకం చేసిన ఈ చట్టం పేరు లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026. రష్యా ఇంధనం, రక్షణ రంగాలపై ఆంక్షలను మరింత కఠినం చేయడమే ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. రష్యా అధికారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పాటు.. ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న షాడో ఫ్లీట్ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా రష్యాకు చమురు, గ్యాస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడమే ఈ చట్టం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.

ఈ కొత్త చట్టంలో భారత్‌కు నేరుగా ప్రభావం చూపించే అంశం సుంకాలు. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న అతిపెద్ద ఐదు దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఈ చట్టం ఇస్తోంది. ఆ సుంకం గరిష్ఠంగా 100 శాతం వరకు ఉండొచ్చు. అయితే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది కాబట్టి వెంటనే 100 శాతం సుంకం వచ్చేసిందని కాదు. ఈ చట్టం సుంకాన్ని ఆటోమేటిక్‌గా అమలు చేయలేదు. అవసరమైతే ఏ దేశంపై ఎంత సుంకం వేయాలి, ఎప్పుడు చర్య తీసుకోవాలి అన్నది అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Also Read : ఇరాన్‌లో ‘CODE 100’.. ట్రంప్ ఎమర్జెన్సీ రిటర్న్..

భారత్ రష్యా నుంచి భారీగా ఆయిల్ కొనడానికి ప్రధాన కారణం.. తక్కువ ధరకు ముడి చమురు దొరకడమే. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వెస్ట్రన్ దేశాలు రష్యన్ ముడి చమురుపై నిబంధనలు పెంచాయి. దీంతో రష్యా తన ముడి చమురును ఆసక్తి ఉన్న కొనుగోలుదారులకు తగ్గింపు ధరతో విక్రయించడం ప్రారంభించింది. భారత్‌లోని రిఫైనరీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంతో.. రష్యా క్రమంగా భారత్‌కు ప్రధాన ముడి చమురు సరఫరాదారుగా మారింది.

భారత్‌కు అవసరమైన ముడి చమురులో పెద్ద భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. 2026 ఆగస్టులో కెప్లర్ సమాచారం ప్రకారం భారత్ రోజుకు సుమారు 2.08 మిలియన్ బారెళ్లు రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ఇది భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 45 శాతం. అంతకుముందు రెండు నెలల్లో రష్యా వాటా 50 శాతానికి పైగా కూడా వెళ్లింది. అంటే భారత్ చమురు దిగుమతుల్లో రష్యా ముడి చమురు ఎంత కీలకంగా మారిందో ఈ సంఖ్యలు చెబుతున్నాయి.

ఇప్పుడు ఇదే డిపెండెన్సీ అమెరికా కొత్త చట్టంతో భారత్‌కు సవాలుగా మారింది. ఒకవైపు రష్యా నుంచి ముడి చమురు పోటీ ధరలో లభిస్తోంది. మరోవైపు దేశానికి నిరంతరంగా ఇంధన సరఫరా ఉండటం కూడా చాలా ముఖ్యం. వాహనాలు, పరిశ్రమలు, విమానయానం, విద్యుత్ రంగం.. ఇలా అనేక రంగాలు చమురు సరఫరా, ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే భారత్‌కు చమురు ఎక్కడి నుంచి వస్తోంది, ఎంత ధరకు వస్తోంది, ఎంత పరిమాణంలో వస్తోంది అన్నది ఇంధన భద్రతలో కీలకంగా మారింది.

ఇదే విషయాన్ని భారత్ కూడా స్పష్టం చేసింది. దేశానికి చమురు సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండటంతో పాటు.. ధరలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవడమే తమ ప్రాధాన్యత అని భారత్ తేల్చి చెప్పింది. చమురు కొనుగోళ్ల విషయంలో లభ్యత, అందుబాటు ధర, మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటామని అంటోంది. అమెరికా కొత్త చట్టం వల్ల భారత్-అమెరికా సంబంధాలతో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై కూడా ప్రభావం ఉండొచ్చన్న అంశాన్ని అమెరికా అధికారులతో చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

మరి అమెరికా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిందన్నది చూస్తే.. రష్యా చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని అమెరికా భావిస్తోంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో మాస్కోకి వచ్చే ఇంధన ఆదాయాన్ని తగ్గించడం అమెరికా ఆంక్షల వ్యూహంలో కీలకంగా మారింది. అందుకే రష్యాపై మాత్రమే కాకుండా.. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న మూడో దేశాలపైనా ఒత్తిడి పెంచే విధానాన్ని ఈ చట్టంలో పెట్టారు.

ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌లో ఉభయ పక్షాల మద్దతు లభించింది. రిపబ్లికన్లతో పాటు డెమోక్రాట్లలోనూ పలువురు సభ్యులు దీనికి మద్దతు ఇచ్చారు. అమెరికా ప్రతినిధుల సభ ఈ బిల్లును 262-159 ఓట్లతో ఆమోదించింది. అంతకుముందు సెనేట్ కూడా భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. అయితే అధ్యక్షుడికి ఇంత విస్తృతమైన సుంకపు అధికారాన్ని ఇవ్వడంపై కొంతమంది అమెరికా చట్టసభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సుంకాల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలపైనా ప్రభావం పడొచ్చన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు భారత్-అమెరికా సంబంధాల కోణంలోకి వస్తే.. ఇప్పటికే వాణిజ్య అంశాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఈ కొత్త చట్టం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు రక్షణ, సాంకేతికత, వ్యూహాత్మక సహకారంలో భారత్-అమెరికా భాగస్వామ్యం కొనసాగుతోంది. మరోవైపు వాణిజ్యం, సుంకాలు, రష్యన్ చమురు వంటి అంశాల్లో అభిప్రాయభేదాలు ఉన్నాయి. దీంతో ఈ చట్టం కూడా రెండు దేశాల మధ్య చర్చల్లో మరో కీలక అంశంగా మారింది.

Also Read : భారత్-పాక్ కాల్పుల విరమణ, ఇరాన్‌కు హెచ్చరిక, ఏఐకి కొత్త పేరు… ట్రంప్ ప్రసంగంలోని 10 కీలక అంశాలు

ఇలాంటి ఆర్థిక ఒత్తిడిని భారత్ గతంలో కూడా ఎదుర్కొంది. 1998లో భారత్ పోఖ్రాన్-II అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత అప్పటి అమెరికా ప్రభుత్వం భారత్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో రెండు దేశాల సంబంధాలు క్రమంగా మారాయి. ముఖ్యంగా జార్జ్ W. బుష్ పరిపాలన సమయంలో ఆంక్షలు తొలగించడంతో సంబంధాల్లో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత రక్షణ, అణు సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి రంగాల్లో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి.

అయితే 1998 పరిస్థితిని ఇప్పటితో పూర్తిగా పోల్చలేం. అప్పటి అంశం అణు పరీక్షలు, అణు వ్యాప్తి నిరోధం చుట్టూ ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రష్యన్ ఇంధన కొనుగోళ్లు, వాణిజ్యం, సుంకాల చుట్టూ సమస్య తిరుగుతోంది. అంటే కారణాలు వేరు.. కానీ ఆర్థిక ఒత్తిడి మాత్రం ఇప్పుడు కూడా రెండు దేశాల సంబంధాల్లో ఒక అంశంగా మారింది. ఇదే సమయంలో భారత్ కూడా ముడి చమురు వనరులను వైవిధ్యపరుస్తోంది. రష్యాతో పాటు ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల నుంచి చమురు దిగుమతులు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశ్చిమాసియాలో సరఫరా అంతరాయాలు, హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు వంటి అంశాలు కూడా భారత్ ముడి చమురు వ్యూహంపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఒకే వనరుపై ఎక్కువగా ఆధారపడకుండా.. విభిన్న వనరుల నుంచి చమురు తెచ్చుకోవడం భారత్‌కు కీలకంగా మారింది.

మరి అమెరికా ఈ చట్టాన్ని భారత్‌పై నిజంగా ఉపయోగిస్తుందా? 100 శాతం వరకు సుంకం విధించే నిర్ణయం తీసుకుంటుందా? లేక భారత్‌తో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా? ఈ అధికారాన్ని అమెరికా ఎలా ఉపయోగిస్తుంది.. భారత్ దానికి ఎలా స్పందిస్తుంది.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై ఎలాంటి మార్పులు వస్తాయి.. అన్నదే రాబోయే రోజుల్లో తేలనుంది.