ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర అలజడిని సృష్టిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి భూగోళం అల్లాడిపోతుండగా.. త్వరలోనే ‘సూపర్ ఎల్‌నినో'(Super El Nino) భయంకరంగా విజృంభించనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పేద దేశాల్లో వేడి తాకిడికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ విడుదల చేసిన తాజా నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండ వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 4.5 లక్షల మంది అదనంగా చనిపోయే అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో నమోదయ్యే సగటు మరణాలకు ఇది అదనమని స్పష్టం చేశారు. 1996 నుంచి 2025 వరకు ఉన్న వాతావరణ డేటాను ప్రామాణికంగా తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు. 1901 నుంచి రికార్డులు నమోదు చేయడం ప్రారంభించిన నాటి నుంచి చూస్తే ఈ ఏడాది ఆగస్టు నెల చరిత్రలోనే ‘అత్యంత వేడిగా ఉన్న ఆగస్టు’గా రికార్డు సృష్టించిందని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నివేదిక పేర్కొంది. ఆఫ్రికాలోని సాహిల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది దేశాల్లో సుమారు 66,800 మంది వేడిమి కారణంగా ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేశారు. ఇందులో ఒక్క నైజీరియాలోనే 31,400 మంది, సుడాన్‌లో 17,500 మంది, నైజర్‌లో 10,000 మంది, ఛాడ్‌లో 8,000 మంది మరణించే ప్రమాదం ఉంది. వైద్య సౌకర్యాలు, సరైన నివాస సదుపాయాలు లేని పేద ప్రజలే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన బాధితులుగా మారుతున్నారు.

Also Read : బాలయ్య మాస్ వీడియోతో ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. మేం రెడీ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇరాన్ ఎంబసీ!

ఆసియా ఖండంలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా దేశాల్లో కలిపి సంయుక్తంగా 19,400 అదనపు మరణాలు సంభవించవచ్చని భావిస్తున్నారు. ఇక ఇండోనేసియా ఒక్కక్కటే 19,300 మరణాలతో తీవ్రంగా నష్టపోనుంది. మన భారతదేశంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల సుమారు 15,800 మంది, బ్రెజిల్‌లో 13,300 మంది చనిపోయే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. భారత్, పాకిస్తాన్ దేశాల్లో రానున్న వేసవి కాలంలో కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, మరణాల సంఖ్య నిలకడగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఎల్‌నినో ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. రాబోయే రోజుల్లో ఇది మరింత బలపడి నవంబర్, డిసెంబర్ నెలల్లో తారస్థాయికి చేరుకుంటుంది. ఈ తీవ్రత 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉంది. అమెరికా నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని.. ముఖ్యంగా భూ ఉత్తరార్ధగోళంలో ఎల్‌నినో ప్రభావం చాలా బలంగా ఉంటుందని తెలిపింది.

ఈ హెచ్చరికలు కేవలం భయపెట్టడానికి కాదని, ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడతాయని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తెలిపింది. ఎండ తీవ్రతపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, పట్టణాల్లో కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, తాగునీటి ఎద్దడి రాకుండా చూడటం, ఆరుబయట పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించడం, అత్యవసర వైద్య సేవలను సిద్ధం చేయడం ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించింది.

Also Read : 10 ఏళ్ల తర్వాత అమెరికాలో షీ జిన్‌పింగ్.. రూల్స్ పక్కనపెట్టిన ట్రంప్.. టెక్ దిగ్గజాలతో గ్రాండ్ వెల్‌కమ్!