పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ కీలకమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. కొన్ని నిర్దిష్ట షరతులు నెరవేరితే హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, అమెరికాతో అణు చర్చలను పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. దీనికోసం 7 రోజుల వ్యవధితో కూడిన ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.

Also Read : డొనాల్డ్‌ ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. కోర్టు సంచలన తీర్పు!

ఈ ప్రతిపాదన గత జూన్ నెలలో అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉందని తెలిపారు. తమ షరతులకు అమెరికా అంగీకరిస్తే 7 రోజుల వ్యవధి ముగిసేనాటికి హోర్ముజ్ జలసంధిని తెరిచి దౌత్య చర్చలను మళ్లీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ ఒప్పందం కుదిరితే ఇరు దేశాలకు మంచిదని అభిప్రాయపడ్డారు.

తమ శాంతియుత అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ ఎప్పుడూ దౌత్యానికే కట్టుబడి ఉంటుందని విదేశాంగ మంత్రి అన్నారు. అయితే ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి భద్రత, ప్రశాంతత నెలకొనాలంటే ఇరాన్ భూభాగంపై అమెరికా తన జోక్యాన్ని, సైనిక దాడి చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు అమెరికా చేస్తున్న అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలను పట్టించుకోకుండా ఉపేక్షిస్తున్నాయని విమర్శించారు.

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూన్‌లో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చర్చలకు సహకరించడానికి బదులుగా తమపై దాడులకు పాల్పడటం, తమ నాయకులు, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం అమెరికా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తమకు యుద్ధం చేయడం ఇష్టం లేదని, సమస్యల పరిష్కారానికి దౌత్య మార్గంలో నడవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Also Read : భగ భగ మండే సూపర్ ఎల్‌నినో.. రాబోయే రోజుల్లో 4.5 లక్షల మంది బలి.. కారణమేంటంటే?