పశ్చిమాసియాలో రగులుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. తాము అమెరికాతో సైనిక ఘర్షణను గానీ, సుదీర్ఘ యుద్ధాన్ని గానీ ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుత వార్ ఎప్పుడు ఎండ్ చేయాలని నిర్ణయించాల్సిన బాధ్యత పూర్తిగా అమెరికాపైనే ఉందన్నారు. యుద్ధాన్ని ఏ రీతిలో ముగించాలనే అంశంపై ఇరు దేశాల మధ్య సరైన అవగాహన కుదరడం లేదని స్పష్టం చేశారు. ఆయన సైనిక చర్యలు ఏ ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చవని వ్యాఖ్యానించారు.

అమెరికాతో పాటు దాని మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యూరప్ దేశాలు ఇరాన్‌లోని అంతర్గత ఆర్థిక సమస్యలను ఆసరాగా చేసుకుని దేశంలో దాడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని పెజెష్కియాన్ ఆరోపించారు. తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ టెహ్రాన్ ఎప్పటికీ అగ్రరాజ్యానికి తలవంచదని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగుస్తుందా అని ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఈ ప్రాంతంలో ప్రశాంతత పునరుద్ధరణ అనేది అమెరికా తీసుకునే నిర్ణయాలు, వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.

Also Read : ట్రంప్‌కు ఇరాన్ మైండ్ బ్లాకింగ్ ఆఫర్.. 7 రోజుల్లో హోర్ముజ్ ఓపెన్.. చర్చలకు రెడీ!

మరోవైపు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై తమ దాడులను మరింత తీవ్రతరం చేయడం కలకలం రేపుతోంది. సౌదీలోని ప్రముఖ చమురు సంస్థ అరామ్‌కో’కు చెందిన కీలకమైన రాస్ తనురా రిఫైనరీనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో తీవ్ర ఆస్తి నష్టం జరగడమే కాకుండా ప్రాణనష్టం కూడా సంభవించినట్లు హూతీ సైనిక వర్గాలు ప్రకటించాయి. చమురు మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వారు ఈ చర్యలకు పూనుకుంటున్నారు.

హూతీల దాడులను ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా దళాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. దక్షిణ తైఫ్ ప్రావిన్స్, ఎర్ర సముద్ర తీర ప్రాంతమైన యాన్బు వైపు దూసుకొచ్చిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ రక్షణ వ్యవస్థ గాల్లోనే విజయవంతంగా పేల్చివేసింది. ఊహించని ఈ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సౌదీ ప్రభుత్వం అత్యవసర రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు అమెరికా-ఇరాన్ వివాదం, ఇటు హూతీల క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : భగ భగ మండే సూపర్ ఎల్‌నినో.. రాబోయే రోజుల్లో 4.5 లక్షల మంది బలి.. కారణమేంటంటే?