
Maharashtra : మహారాష్ట్రలో ఓ వివాహితను బెదిరించి అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న తన కొడుకుకు ఉరిశిక్ష వేయాలని ఓ తల్లి కోరింది. థానే జిల్లా భివాండిలో జరిగిన అత్యాచార కేసులో నిందితుడైన మాజీ పోలీస్ కానిస్టేబుల్ షైలేష్ పాటిల్ గతంలో కూడా పలువురు మహిళలను వేధించాడని అతడి తల్లి సులోచనా పాటిల్ ఆరోపించారు.
మీడియాతో మాట్లాడిన సులోచనా పాటిల్.. తన కొడుకు తన ఆస్తులు, భూములు, పెద్ద మొత్తంలో నగదును తుపాకీ చూపించి బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. నకిలీ పత్రాలు సృష్టించి తనను ఇంటి నుంచి బయటకు పంపించాడని, దీంతో ప్రస్తుతం తన కుమార్తె వద్ద ఉంటున్నానని చెప్పారు. భివాండిలో సెప్టెంబర్ 13న జరిగిన ఘటన ఒక్కటే కాదని ఆమె అన్నారు. గతంలో కూడా తన కొడుకు బెదిరింపులతో పలువురు మహిళలను బాధితులుగా మార్చాడని ఆరోపించారు.
షైలేష్ గతంలో ఓ సీనియర్ IPS అధికారిని కాపాడేందుకు నేరాన్ని తనపై వేసుకుని జైలుకు వెళ్లాడని సులోచనా పాటిల్ తెలిపారు. ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో నేరగాళ్లతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అతడి ప్రవర్తన పూర్తిగా మారిపోయి నేరాల వైపు వెళ్లాడని ఆమె ఆరోపించారు.
తన కొడుకు చేసిన పనులకు కఠినమైన శిక్ష విధించాలని, అతడిని ఉరి తీయాలని అధికారులను కోరారు. అలాగే తన నుంచి అక్రమంగా తీసుకున్న ఆస్తులను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మాజీ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్, మాజీ పోలీస్ కానిస్టేబుల్ షైలేష్ పాటిల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. సెప్టెంబర్ 13న ఓ వివాహిత మహిళను భివాండిలోని బాప్గావ్కు తీసుకెళ్లి, తుపాకీతో బెదిరించి, మద్యం తాగించి అత్యాచారం చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.









