The Paradise : నాని హీరోగా నటించిన చిత్రం ‘ది ప్యారడైజ్‌’. (The Paradise). తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అందరి మన్ననలు అందుకుంటోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ప్యారడైజ్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్యారడైజ్‌ సినిమా ముఖ్యంగా బి, సి సెంటర్లతో పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో మాస్‌ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు సోషల్‌మీడియాలోనూ ఈ మూవీ విపరీతంగా వైరల్‌ గా మారింది.

Also Read : హీరో భార్యకు నేను నచ్చలేదట.. అందుకే సినిమా నుంచి తీసేశారు: తాప్సీ

కాగా, తాజాగా మరోసారి చిత్రానికి ఊపు వచ్చే విషయం వెల్లడైంది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ చిత్రాన్ని చూడబోతున్నట్లు ప్రకటించడం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఈ సినిమాను శనివారం రాత్రి వీక్షించనున్నట్లు కేటీఆర్‌ (KTR) ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘‘చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు రాత్రి థియేటర్‌లో సినిమా చూడాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. నా అభిమాన నటుడు నాని, టాలెంటెడ్‌ యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కలిసి తీసిన ‘ది ప్యారడైజ్‌’ చూడబోతున్నా’’ అని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకర్‌ పాత్రలో ప్రియదర్శి కనిపించారు. ఈ సినిమాలో కేసీఆర్‌ స్టయిల్‌, డైలాగ్స్‌తో ప్రియదర్శి అదరగొట్టాడు. సవారీ తెగకు, శంకర్‌ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్‌లో దుమ్ము రేపుతున్నాయి. కేసీఆర్‌ ను పోలిన పాత్రకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ‘ది ప్యారడైజ్‌’ చూస్తానంటూ పోస్ట్‌ పెట్టడం విశేషం.

కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. కేవలం రెండు రోజుల్లో రూ.114 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించడం గమనార్హం. నాని కెరీర్‌లో అత్యంత వేగంగా ఇంతట వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ది ప్యారడైజ్‌’ను చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటివరకూ బుక్‌ మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌ వేదికగా 2.5 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడు కావడం విశేషం.

‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌తో మరోసారి సినిమా చేయడానికి కారణాలను నాని తాజాగా వెల్లడించారు. అద్భుతమైన విజువల్స్‌, భావోద్వేగాల మేళవింపుగా ఓ భారీ కమర్షియల్‌ సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే ‘ది ప్యారడైజ్’ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ప్రేక్షకులకు అద్భుతమైన మెయిన్‌ స్ట్రీమ్‌ కమర్షియల్‌ సినిమాను శ్రీకాంత్‌ ఓదెల ఇవ్వగలడన్న నమ్మకం నాకు ఉంది. రోజూ చూసే సినిమాలకన్నా ఓ ప్రత్యేకమైన ఉత్సాహంతో కూడిన కథను ఇవ్వాలనుకున్నాం. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ చిత్రం కథ. నిజ జీవితంలో నేనెప్పుడూ ‘జడల్‌’లా ఉండను. కానీ, ‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రకు దగ్గరగా ఉంటా. అలా అని శనివారం మాత్రమే నాకు కోపం వస్తుందని కాదు’’ అంటూ నాని సరదాగా చెప్పుకొచ్చారు.

Also Read : ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.