Vijayawada :  ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను బయటకు తీసుకొచ్చారు. భవానీపురానికి చెందిన షఫీనే కళ్యాణిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. కళ్యాణితో షఫీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కుమారుడి విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కళ్యాణి కుమారుడిని కొంతకాలంగా షఫీ పెంచుతున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కళ్యాణి షఫీపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవ
ని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు కళ్యాణి తనకు తరచూ డబ్బులు ఇవ్వాలని షఫీని అడిగేదని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని ఆమె బెదిరించినట్లు కూడా పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 17న రూ.20 వేలు ఇవ్వాలని కళ్యాణి షఫీని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : నగలు, నగదుతో వీడియో…. ఉన్నదంతా ఊడ్చుకెళ్లిన దొంగలు

దీంతో కళ్యాణిని తన ఇంటికి తీసుకెళ్లిన షఫీ అక్కడ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు సమాచారం. తన మటన్ షాపులో పనిచేసే గురువులు అనే వ్యక్తికి విషయం చెప్పిన షఫీ.. అతని సహాయంతో మృతదేహం ముక్కలను బ్యాగుల్లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ బ్యాగులను గొల్లపూడి సమీపంలోని కూలింగ్ కెనాల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 రోజుల క్రితమే కళ్యాణిని హత్య చేసి ఉండొచ్చని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ కేసులో షఫీతో పాటు అతని మటన్ షాపులో పనిచేసే గురువులు పాత్రపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత నిందితులు ఎవరెవరిని కలిశారు? మృతదేహాన్ని తరలించడంలో ఇంకా ఎవరైనా సహకరించారా? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

అంతేకాకుండా కళ్యాణికి సన్నిహితంగా ఉన్న మరికొందరి పాత్రపైనా విచారణ జరుగుతోంది. బంగారం షాప్‌కు చెందిన దామోదర్, కరీం హోటల్‌కు చెందిన గౌస్, ఆల్ఫా హోటల్‌కు చెందిన అదానీ అలీ గురించి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కళ్యాణి హత్యకు అసలు కారణం ఏంటి? డబ్బుల వ్యవహారమా? కుమారుడి విషయంలో జరిగిన వివాదమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.

Also Read : కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి.. ట్విస్ట్ ఏంటంటే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.