పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాబోయే నవంబరు నెలలో అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ దాడులకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు హర్మూజ్ జలసంధిని ఒక వారంలో తెరుస్తామని ఇరాన్ ప్రతిపాదన తెచ్చింది. అయితే ఈ ఆఫర్‌ను డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం పట్టించుకోకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా హర్మూజ్ జలసంధి ఫొటోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. దానికి ఏకంగా ‘ట్రంప్ జలసంధి’ అని నామకరణం చేశారు.

అమెరికా పెట్టిన కఠిన నిబంధనలను ఇరాన్ ఎప్పటికీ నెరవేర్చదనే నమ్మకంతో ట్రంప్ ఉన్నారని వాషింగ్టన్ అధికారులు చెబుతున్నారు. హర్మూజ్ జలసంధిని పూర్తిగా నిరంతరం తెరిచి ఉంచడం, ఎలాంటి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా ఉండటం అనేవి అమెరికా ప్రధాన డిమాండ్లు. ఇరాన్ ఇస్తున్న హామీలపై ట్రంప్‌కు ఏమాత్రం విశ్వాసం లేదని, శాంతి చర్చల విషయంలో ఆయన దూరంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

ఒకవేళ మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తే తన అధికారాన్ని ప్రదర్శించేందుకు ట్రంప్ ఏకపక్షంగా ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవైపు యుద్ధ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ.. మరోవైపు ఇరు దేశాల మధ్య పరోక్షంగా రాయబారాలు సాగుతున్నాయి. గల్ఫ్ దేశమైన ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య సందేశాలను అటుఇటు చేరవేస్తోంది. ఈ చర్చల్లో భాగంగా తమ దేశంపై విధించిన గగనతల ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇరాన్ అమెరికాను కోరింది.

అమెరికా తీరుపై ఇరాన్ బలగాలు తీవ్రంగా స్పందించాయి. మళ్లీ దాడులకు దిగి తొందరపాటు తప్పు చేయవద్దని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అమెరికాను హెచ్చరించింది. ఒకవేళ అమెరికా గనుక మళ్లీ సాహసానికి ఒడిగడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏది ఏమైనా, నవంబర్ ఎన్నికల తర్వాత పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా మళ్లీ యుద్ధ వాతావరణం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.