
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి మాటల తూటాలు పేల్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నేరుగా సజిషన్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యక్షంగా మాట్లాడి త్వరలోనే శాంతి ఒప్పందానికి ఓ దారి వెతకాలన్నారు. యుద్ధానికి ముగింపు పలికి, రెండు దేశాల నడుమ సంధి కుదర్చడమే లక్ష్యంగా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.
న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన అనంతరం డోనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా పుతిన్, జెలెన్‌స్కీ ఒకరికొకరు సర్దుకుపోతూనే వస్తున్నారు. త్వరలోనే వారిద్దరూ ఒక పీస్ డీల్‌కు రావచ్చని అన్నారు. రాబోయే శీతాకాలం ప్రారంభానికి ముందే ఈ యుద్ధం ముగింపుపై ప్రకటన వెలువడినా మనం ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని జెలెన్‌స్కీ చాలా బలంగా కోరుకుంటున్నారని ట్రంప్ తెలిపారు.
రష్యా సాగిస్తున్న దురాక్రమణను అడ్డుకోవడంలో, అంతం చేయడంలో తమకు వైట్‌హౌస్ ఎంతగానో సహాయపడుతుందని భావిస్తున్నట్లు జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాపై ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య పరిమితులను మరింత తీవ్రం చేయాలని ఐక్యరాజ్యసమితి వేదికగా విజ్ఞప్తి చేశారు. రష్యాకు చమురు, వాణిజ్యం ద్వారా వచ్చే ఆదాయానికి గండి కొడితేనే యుద్ధాన్ని పొడిగించడానికి మాస్కో దగ్గర డబ్బులు లేకుండా పోతాయని దీని ద్వారా వారు లొంగివస్తారని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
శాంతి చర్చల మాటలు ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ.. కీవ్, మాస్కో బలగాలు భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. శనివారం రాత్రి ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా చేపట్టిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌లోని కీలకమైన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ డేటా సెంటర్‌తో పాటు పలు ప్రభుత్వ, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలే లక్ష్యంగా విరుచుకుపడింది.









