
South Africa shooting : దక్షిణాఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలో ఏకంగా 27 మంది మృతి చెందారు. జొహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ నగరాల సమీపంలో ఉన్న పట్టణాల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. జొహాన్నెస్ బర్గ్ సమీపంలోని వెడెలా టౌన్షిప్లో ఉన్న ఓ బార్ అండ్ పబ్‌లో శనివారం రాత్రి దాటిన తర్వాత దుండగులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. పబ్‌లోకి ఏకే 47 రైఫిళ్లు, పిస్టళ్లతో ప్రవేశించిన ఎనిమిది మంది దుండగులు ఏకంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీకెండ్ కావడంతో కస్టమర్లు పబ్ బయట, లోప మద్యం సేవిస్తున్న సమయంలో నిందితులు ఆయుధాలతో అక్కడికి వచ్చారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. మొదట బయటఉన్న వారిపై కాల్పులు జరిపిన నిందితులు ఆపై లోపలకు వెళ్లి మరింత మారణహోమం సృష్టించారు. నిందితుల్లో కొంతమంది కస్టమర్ల వద్ద నుంచి సెల్‌ఫోన్స్ తీసుకుని రెండు వాహనాల్లో పారిపోయారని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో ఇంకా ఎవరూ పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. నిందితులు ఎందుకోసం కాల్పులకు తెగబడ్డారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే కాల్పులకు కారణం ఎవరు? కాల్పులకు గల కారణం ఏంటీ అనేది ఇంకా తెలియరాలేదు.
మరో ఘనటలో కేప్‌టౌన్ సమీపంలోని ల్వాండ్లేలోఈ రోజు( ఆదివారం తెల్లవారుజామున) ఉదయం ఓ దుకాణంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలకు కొద్ది రోజుల ముందే డర్బన్ సమీపంలోని ఓ ఇంట్లో జరిగిన పార్టీ జరుగుతున్న సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు దుండగులు జరిపిన దాడిలో గర్భిణితో సహా 11 మంది మృతిచెందారు. ఆయా ఘటనల్లో నిందితుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. వరుస ఘటనలతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.









