
Parvesh Verma:ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజల సమస్యలపట్ల చిత్తశుద్ధితో ఉండాలి. వారి సమస్యలపట్ల సానుకూలంగా ప్రవర్తించాలి. కానీ ఓ మంత్రి సహనం కోల్పోయి సమస్యను ప్రస్తావించిన వ్యక్తిపై చేయి చేసుకోవడం తీవ్ర దుమారానికి తెరలేపింది. వివరాల ప్రకారం ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ తను మంత్రిననే విషయం మరిచిపోయి సహనం కోల్పోయారు. ప్రతిపక్ష పార్టీ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఎదుటే.. ఒక వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. మంత్రి రహదారి పరిశీలనకు వెళ్లిన సమయంలో అక్కడ వీడియో తీస్తున్న ఓ యువకుడిని మంత్రి కొట్టడం వీడియో రికార్డయింది. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
यह भारत की राजधानी दिल्ली की भाजपा सरकार के pwd मिनिस्टर हैं
सड़क का निरीक्षण करने आए थे पर घोटाले ही घोटाले उजागर होते देखकर आपा खो बैठे और वीडियो रिकॉर्ड करने वाले मेरे साथी को के साथ गुंडागर्दी कर बैठे..
@ArvindKejriwal @narendramodi @AamAadmiParty @gupta_rekha @p_sahibsingh @LtGovDelhi— Jarnail Singh (@JarnailSinghAAP) September 27, 2026
ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని (Delhi) తిలక్ నగర్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిలక్‌నగర్‌లో ఇటీవల ప్రభుత్వం రోడ్డు నిర్మించింది. అయితే, దీని నాణ్యతపై విమర్శలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్న పర్వేశ్ వర్మ రోడ్డు తనిఖీ చేసేందుకు వెళ్లారు. స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కూడా ఆయనతో అక్కడికి వచ్చారు.
ఈ క్రమంలో మంత్రి ఎదుటే.. ఎమ్మెల్యే జర్నైల్ రోడ్డును చేత్తోనే తవ్వి ఓ పెళ్లను బయటకు తీసి చూపించారు. ‘చూశారా? మంత్రి గారూ.. మీరు ఎంత నాసిరకంగా రోడ్డు వేయించారో’ అంటూ ఆయనకే చూపించడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘గత 15 ఏళ్లుగా మీరే అధికారంలో ఉన్నారు కదా.. అప్పుడు మీరు చేయలేని పని మేం చేశాం సంతోషించు’ అని మంత్రి తీవ్రంగా సమాధానం ఇచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ‘అయితే.. కనీసం 15 రోజులైనా పూర్తవకుండానే చెడిపోయేంత నాసిరకంగా వేస్తారా?’ అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో మాట్లాడుతూనే మంత్రి ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. రోడ్డు పై నుంచి తీసిన పెళ్లను చేత్తో పట్టుకొని ఎమ్మెల్యే కూడా ఆయనను అనుసరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్లో ఈ ఘటనను రికార్డు చేస్తున్నాడు. ఇది చూసి కోపంతో సహనం కోల్పోయిన మంత్రి ఫోన్‌ను పక్కకు నెట్టేసి.. అతడి చెంపపై చెల్లుమనిపించారు. దీంతో అతను కూడా మంత్రి మీదకి దూసుకెళ్లడంతో.. పోలీసు సిబ్బంది అప్రమత్తమై అతన్ని పక్కకి తీసుకెళ్లిపోయారు. అక్కడున్న ఆప్ నేతలు, కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విషయమై మంత్రి పర్వేశ్ వర్మ స్పందించారు. తను చేసిన పనిని సమర్థించుకున్నారు. తిలక్‌నగర్ వెళ్లగానే.. ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ తన అనుచరులతో అక్కడికి వచ్చి రాద్ధాంతం చేశారని ఆరోపించారు. వారిలో ఒకరు తన కుటుంబ సభ్యులను దూషించాడన్నారు. అందుకే కోపంతో కొట్టానని చెప్పుకున్నారు. తన స్థానంలో ఎవరున్నా.. అదేపని చేస్తారని సమర్థించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎక్స్‌లో పోస్టు చేయడం, మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో వైరల్‌గా మారింది.









