Nepal Floods : నేపాల్‌ను వరదల భయం వీడటం లేదు. ఇటీవల అకస్మాత్తుగా సంభవించిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా గడచిన మూడు రోజుల్లోనే 24మంది ప్రాణాలు కోల్పోయారు. మరో15మందికి పైగా గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా అటవీ ప్రాంతాలలోని అనేక నివాసాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రాకపోకలు స్తంభించాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఒక వీడియోలో ఇళ్లకు సమీపంలో ఉన్న కొండచరియలలోని సగభాగం క్షణాల్లో కూలిపోయిన దృశ్యాలు భయం గొల్పుతున్నాయి. అనేక గ్రామాలను వరదలు ముంచెత్తుతుండడంతో వందలాది మంది ప్రజలను ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు.

Also Read : చట్టాన్ని పక్కన పెట్టి చైనాకు ఆయుధాలు.. ట్రంప్ స్కెచ్ అదేనా?

పొంగి పొర్లుతున్న నదులు

కాగా, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నేపాల్‌లోని కాళి, గండకి, నారాయణి, టినౌ తదితర నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ అప్రమత్తమయ్యింది. నదులకు సమీపంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదులలో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాలలో వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.. సుమారు 1,500 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వంతెనలు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. కాళీ గండకీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో స్యాంగ్జాలోని బెల్తారీలో ఉన్న 144-మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుకు చెందిన మీర్మీ డ్యామ్ మూడు గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు వదులు తున్నారు. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. గత నెలలో వచ్చిన ఆకస్మిక వరదలతో ఇప్పటివరకూ దాదాపు 1,453 మంది ప్రాణాలు కోల్పోగా.. 5వేల మందికి పైగా గల్లంతైన విషయం తెలిసిందే.

Also Read : ఏఐ అదుపు తప్పుతోందా? వినియోగదారుల చిత్రాలు లీక్ అయ్యాయా?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.