IRAN WOMEN IN WAR : ఇరాన్, అమెరికా యుద్ధం ఇంకా ముదురుతోంది. అమెరికా దాడులకు ఇరాన్‌ ఏమాత్రం తగ్గకపోగా మరోసారి పోరుకు సై అంటోంది. అమెరికాతో తుదిపోరుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు ఇరాన్‌ ఏ మాత్రం లొంగకపోగా మరింత పదునుదేరుతుంది. ఈ క్రమంలో అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ భారీ సమీకరణకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మహిళలు ఆయుధాలతో రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా టెహ్రాన్‌లో ఆయుధాలు ధరించిన మహిళలు మిలటరీ తరహా కవాతులో పాల్గొన్నారు. పలువురు మహిళా వాలంటీర్లు చేతుల్లో రైఫిళ్లు పట్టుకుని కవాతు చేశారు. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌– జన్‌ఫదా పేరుతో మహిళా వాలంటీర్‌ బలగాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మహిళలు, పురుషులు, యువతకు ప్రాథమిక సైనిక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.ఈ సందర్భంగా దేశ రక్షణకు సిద్ధమంటూ వాలంటీర్లు ప్రకటించారు. ఈమేరకు లక్షలాది మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నట్లు ఇరాన్‌ వెల్లడించింది.

అమెరికాతో తుదిపోరుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించిన ఇరాక్‌ మహిళా సైనికులతో ఇరాన్‌లో కవాతు నిర్వహించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ వీధుల్లో కనిపించిన మహిళా సైనికుల కవాతు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హిజాబ్‌ ధరించిన వేలాది మంది మహిళలు తుపాకులు చేతబట్టి సైనిక కవాతులో పాల్గొనడంతో పాటు , ఒక వైపు సైనిక దుస్తులు, మరోవైపు హిజాబ్‌ ధరించి ర్యాలీ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాక ర్యాలీలో భాగంగా డ్రోన్లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను ప్రదర్శించడం.. వంటివన్ని దేశ రక్షణ కోసం సాధారణ మహిళలను కూడా సిద్ధం చేస్తున్నామని ఇరాన్‌ ప్రభుత్వం తేల్చి చెప్పినట్లయ్యింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18న టెహ్రాన్‌లో ఇదే తరహా ర్యాలీ నిర్వహించింది. దీనికి ‘జన్ఫదా-యే ఇరాన్‌’ అని పేరు పెట్టారు. అంటే ‘ఇరాన్‌ కోసం త్యాగం చేసేవారు’ అని అర్థం. ఈ ర్యాలీలో సుమారు 3,13,000 మంది పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read : తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

6 లక్షల మంది శిక్షణకు సిద్ధమా?

ర్యాలీ కేవలం ప్రదర్శనకే పరిమితం కాలేదు. ఇరాన్‌ పౌరులను పరిమిత సైనిక, అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షంచుకోవడం, సహాయక చర్యల్లో పాల్గొనడం వంటి శిక్షణకు సిద్ధం చేసే కార్యక్రమాన్ని కూడా ఇరాన్‌ ప్రారంభించింది. టెహ్రాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కమాండర్‌ జనరల్‌ హసన్‌ హసన్‌జాదెహ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 6 లక్షల మందికి పైగా ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 10 లక్షలకు పైగా చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ , దాని వాలంటీర్‌ విభాగమైన బసీజ్‌ బలగాలకు తోడు అదనపు భద్రతా వ్యవస్థగా ఈ వాలంటీర్లను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వీరికి అసాల్ట్‌ రైఫిళ్లతో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

ఈ ర్యాలీలో మహిళల పాల్గొనడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన మహిళా సభ్యులు నల్లటి హిజాబ్‌లు ధరించి రైఫిళ్లతో కనిపించారు. మరికొంతమంది మహిళలు, యువత ప్రత్యేక విభాగాల్లో కవాతు చేశారు. దీంతో యుద్ధ సమీకరణాల్లో మహిళలను కూడా దేశ రక్షణలో భాగంగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. ర్యాలీలో సైనిక సామగ్రిని కూడా ప్రదర్శించారు. డ్రోన్లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్యాటరీలు, ఇతర ఆయుధ వ్యవస్థలను ప్రజలకు చూపించారు. ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు.. దేశంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాతావరణాన్ని చూపించడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.

Also Read : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు!

అమెరికా, ఇజ్రాయెల్‌పై నినాదాలు

కాగా ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు కొందరు అమెరికా, ఇజ్రాయెల్‌ జెండాలను తొక్కుతూ “డెత్‌ టు అమెరికా”, “డెత్‌ టు ఇజ్రాయెల్‌” అంటూ నినాదాలు చేయడం కనిపించింది. కాగా ఈ ర్యాలి సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, సైనికాధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలొన్నట్లు తెలుస్తోంది. ఈ ర్యాలి ద్వారా ప్రపంచదేశాలకు తమ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం ఇరాన్‌ చేసిందనే వాదన వినవస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.