
SR Nagar Gokul Pride Hotel: ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూమ్‌లో జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకు పరిచయమైన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో శారీరక సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా లాడ్జికి తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. పెళ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంతో గొడవపడి ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామానికి చెందిన బేగరి శిరీష (34) హైదరాబాద్ లోని ఓ కస్టమర్ కేర్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అదే జిల్లా తాండూరు మండలం ఓబులాపూర్‌కు చెందిన పాత నేరస్థుడు అవుసలపల్లి శ్రీనివాస్ (38) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇద్దరి మధ్య చనువుగా మారింది. ఈ క్రమంలో శిరీష తనకు 2013లో పెళ్లయిందని, వ్యక్తిగత కారణాలతో 2016లో భర్తతో విడాకులు తీసుకున్నట్లు శ్రీనివాస్‌కు తెలిపింది. దీంతో శిరీషను నమ్మించిన శ్రీనివాస్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరచూ ఆమెను వెంట తీసుకెళ్లేవాడు. అలా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 24న అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ అమీర్‌పేటలోని గోకుల్ ప్రైడ్ ఓయో లాడ్జికి చేరుకున్నారు. ఇద్దరూ తప్పుడు ఆధార్ కార్డులు చూపించి సీ. గణేష్, దుర్గ పేర్లతో లాడ్జిలో నమోదు చేసుకుని మొదటి అంతస్తులోని 103వ గదిలో చేరారు. దాదాపు మూడు రోజులపాటు వారిద్దరూ గదిలోనే ఉన్నారు. అయితే సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి గదిలోనే శిరీషకు శ్రీనివాస్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో శిరీషను కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం శ్రీనివాస్ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో లాడ్జి గది నుంచి బయటకు వెళ్లాడు. గది ఖాళీ చేస్తున్నానని చెప్పిన అతను రిసెప్షన్లో బిల్లు చెల్లించి… శిరీష ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసి వెళ్లిపోతుందని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే శ్రీనివాస్ చెప్పిన సమయం దాటి నప్పటికీ చాలాసేపటి వరకు గది తలుపులు తెరుచుకోకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. కాలింగ్ బెల్ మోగించినా గది నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారికి అనుమానం పెరిగింది. దీంతో డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాడ్జి సిబ్బంది వద్ద ఉన్న మరో తాళంతో గది తలుపులు తెరిచి చూశారు.. గదిలో శిరీష మంచంపై మృతిచెంది కనిపించింది. ఆమె వద్ద ఉన్న మరో ఆధార్ కార్డు ఆధారంగా ఆమెను శిరీషగా గుర్తించారు. శ్రీనివాస్ తో ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో కోపంతో ఆమెను చంపి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితున్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.









