Ukraine-Russia War : నాలుగేండ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోంది. వీలయినంత వరకు ఎప్పటికప్పుడు రష్యాను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ అమలు చేస్తోన్న ఓ ప్లాన్ మాస్కో సేనలను నిద్రపోనివ్వడం లేదు. రష్యా సోవియెట్‌ కాలంలో ఉపయోగించిన పాత వాహనాలను ఉక్రెయిన్‌ ‘జాంబీ కార్లు (Zombie Cars)’గా మార్చుతోంది. ఆ వాహనాలను ప్రయోగించడం ద్వారా రష్యా సైనికులను ఉక్రెయిన్‌ దళాలు బంధి చేస్తున్నాయి.

రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్‌ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కీవ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ‘ఆపరేషన్‌ వివాల్డీ’ పేరుతో రష్యాపై యుద్ధాన్ని ప్రకటించింది. అందులో భాగంగా ఆక్రమిత నోవ్‌ ప్రాంతంలో రష్యా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపైకి మానవరహిత వాహనాలను పంపుతోంది. సోవియట్‌ కాలం నాటి బీటీఆర్‌-60 వాహనాలను సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లుగా మార్చుతోంది. వాటిలో పేలుడు పదార్థాలను అమర్చుతోంది. ఈ జాంబీ కార్లు.. రష్యా స్థావరాల వద్దకు చేరుకోగానే వాటిని ఉ్రకెయిన్ పేల్చేస్తోంది. పేలుడు ధాటికి అక్కడ ఉన్న కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, నియంత్రిత వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఆ తర్వాత ఉక్రెయిన్ సైనిక దళాలు ఆ స్థావరంపైకి దండెత్తుతున్నాయి.. అక్కడ ఉన్న రష్యా సైనికులను బందీలుగా పట్టుకుంటున్నారు. ఇటీవల ఒక స్థావరం పై దాడి చేసిన ఉక్రెయిన్‌ 250 మంది మాస్కో సైనికులను బంధించింది.

Also Read : ఇరాక్‌కు గుడ్ బై చెప్పేసిన అమెరికా.. 23 ఏళ్ల బిగ్ డ్రామాకి ఎండ్ కార్డ్.. వెనకున్న మాస్టర్ ప్లాన్ ఇదే!

ఈ ఆపరేషన్‌ను ఉక్రెయిన్‌కు చెందిన థర్డ్‌ ఆర్మీ కోర్‌ దళం నిర్వహిస్తున్నట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. ఈ దళానికి బ్రిగేడియర్‌ జనరల్‌ ఆండ్రీ బిలెట్‌స్కీ సారథ్యం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను థర్డ్‌ ఆర్మీ దళం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగు చూసింది. తమ ఆపరేషన్‌తో నోవ్‌ ప్రాంతంలో ఉన్న రష్యన్‌ యూనిట్‌ మొత్తం లొంగిపోయిందని ఆండ్రీ స్పష్టం చేశారు. తమ ఆధీనంలో ఉన్న రష్యా సైనికులను ఉపయోగించుకుని ఆ దేశం చెరలో ఉన్న తమ ఉక్రెయిన్‌ సైనికులను విడిపించుకుంటామని ఆండ్రీ పేర్కొన్నారు. ఆపరేషన్‌ వివాల్డీతో.. నోవ్‌తో పాటు మరో రెండు గ్రామాలకు స్వేచ్ఛ కల్పించినట్లు ఆయన వెల్లడించారు.

కాగా, ఉక్రెయిన్‌ నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌తో రష్యా ఆధీనంలో ఉన్న మొత్తం భూభాగంలో ఇప్పటివరకు 68 చదరపు మైళ్ల భూభాగాన్ని రష్యా దళాల నుంచి ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ అధ్యయన సంస్థలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇంకా ఉక్రెయిన్‌ కు చెందిన దాదాపు 45వేల చదరపు మైళ్ల భూభాగం మాస్కో సైన్యం ఆధీనంలోనే ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌ మొత్తం భూభాగంలో ఇది 20శాతానికి సమానం కావడం గమనార్హం.

Also Read : సిలికాన్ వ్యాలీలో కలకలం.. 100 మందికి పైగా పేర్లతో రహస్య జాబితా

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.