Gautam Gambhir : గువాహటి వేదికగా రెండో వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినా.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో బ్యాట్, బంతి మధ్య పోటీ కనిపించకపోవడం తనకు నచ్చలేదని చెప్పారు. నిజాయితీగా చెప్పాలంటే బ్యాట్, బంతి మధ్య మరింత పోటీ ఉండాలి. మీరు క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు.. కానీ ఇది క్రికెట్ కాదు, ఇది కేవలం బ్యాటింగ్ మాత్రమే అని గంభీర్ కామెంట్ చేశారు. ఒక యువ బౌలర్ ఇలాంటి పిచ్‌పై బౌలింగ్ చేయడం ఎంత కష్టమో ఆలోచించాలని అన్నారు. ప్రత్యర్థి 400 పరుగులు చేస్తే.. తాము కూడా 400 పరుగులు ఛేజ్ చేసే పరిస్థితి రావడం బౌలర్లకు న్యాయం కాదని చెప్పారు. ప్రేక్షకులకు, రికార్డులకు, బ్రాడ్‌కాస్టర్లకు ఇలాంటి మ్యాచ్‌లు బాగానే ఉంటాయని.. కానీ ఒక క్రికెట్ అభిమానిగా, కోచ్‌గా తాను బౌలర్ల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు.

బౌలర్ల గణాంకాలను చూసి వెంటనే వారిని తప్పుపట్టకూడదని కూడా గంభీర్ సూచించారు. కొన్ని పరిస్థితుల్లో బౌలింగ్ ఫిగర్స్ చాలా దారుణంగా కనిపించినా.. వారు అంత చెత్తగా బౌలింగ్ చేసి ఉండకపోవచ్చని అన్నారు. ప్రస్తుత వన్డే క్రికెట్‌లో రెండు కొత్త బంతులు, పవర్ హిట్టింగ్, పరిమిత ఫీల్డింగ్ కారణంగా బౌలర్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. బౌలర్లు తమ ప్లాన్‌ను సరిగ్గా అమలు చేశారా లేదా అనేదే ముందుగా చూడాలని గంభీర్ అన్నారు. కేవలం బౌలింగ్ గణాంకాలను చూసి వారిపై ఒత్తిడి పెంచితే కొత్త బౌలర్లను అభివృద్ధి చేయలేమని చెప్పారు.

Also Read : ఏంటి నిజమా? బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా?.. నిజమెంత?

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో యువ బౌలర్ ఔకిబ్ నబీకి అరంగేట్రం చేసే అవకాశం భారత్ ఇచ్చింది. సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లోనే యువ ఆటగాళ్లను పరీక్షించడం ఉద్దేశపూర్వకమేనని గంభీర్ తెలిపారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో యువ బౌలర్లు ఆడటం అవసరమని చెప్పారు. డెడ్ రబ్బర్ మ్యాచ్‌లో యువ బౌలర్‌కు అవకాశం ఇస్తే.. గెలవాల్సిన ఒత్తిడి ఉండదని గంభీర్ అన్నారు. ప్రపంచకప్‌లో మాత్రం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే ఇప్పటి నుంచే ఆ ఒత్తిడిని ఎదుర్కొనేలా బౌలర్లను సిద్ధం చేయాలని చెప్పారు.

2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది మాత్రమే ఉందని చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి భారత్‌కు ప్రయోగాలు చేయడానికి అంత సమయం లేదని గంభీర్ వివరించారు. ఐపీఎల్‌కు మూడు నెలలు, భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు మరో మూడు నెలలు వెళ్తాయని చెప్పారు. ఈ సిరీస్ తర్వాత ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు దాదాపు 20 వన్డేలు మాత్రమే మిగిలి ఉంటాయని తెలిపారు. అందులో శ్రీలంకతో మూడు, జింబాబ్వేతో మూడు మ్యాచ్‌లు కూడా ఉన్నాయని గంభీర్ చెప్పారు. అందుకే ఇప్పటి నుంచే వేర్వేరు ఆటగాళ్లను పరీక్షించి, ఎవరెవరు ఈ ఫార్మాట్‌లో ఏం చేయగలరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే శనివారం న్యూ చండీగఢ్‌లోని పీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

Also Read : ఆ నరరూప రాక్షసుడు ఖతం.. పహల్గామ్ హంతకుడు హతం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.