Andhra Pradesh : ఏపీలో ఓ బీజేపీ నేత బైక్‌కు నిప్పుపెట్టిన కేసులో షాకింగ్ విషయం బయటపడింది. బైక్‌కు నిప్పుపెట్టిన ఘటనపై విచారణ చేస్తుండగా.. తన భర్తను చంపేందుకు అతడి భార్యే ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న రాత్రి బీజేపీ మండల అధ్యక్షుడు మునిరాజుకు చెందిన బైక్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మునిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట పోలీసులు దీనిని కేవలం బైక్‌కు నిప్పుపెట్టిన ఘటనగానే తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ ఘటన వెనుక ఏదైనా రాజకీయ గొడవ ఉందా అని కూడా పోలీసులు చూశారు. వినాయక చవితి ఫ్లెక్సీల విషయంలో జరిగిన గొడవను కూడా పరిశీలించారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు దొరకలేదు. దీంతో పోలీసులు అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. టెక్నికల్ ఆధారాలను కూడా చూశారు. ఈ దర్యాప్తులో సాయి, ఉదయ్ కిరణ్, లీలాకృష్ణ, పృథ్వీరాజ్, హరీశ్ అనే ఐదుగురి పేర్లు బయటకు వచ్చాయి.

Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. మునిరాజు బైక్‌కు నిప్పుపెట్టింది తామేనని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇక్కడే కేసులో పెద్ద ట్విస్ట్ వచ్చింది. మునిరాజు భార్య ప్రశాంతి కూడా ఈ కేసులో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించారు. నిందితుల్లో ఒకరైన సాయితో ప్రశాంతికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమె తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలను సాయితో పంచుకున్నట్లు పోలీసులు చెప్పారు.

అంతేకాదు.. మునిరాజుపై దాడి చేసి చంపేందుకు ప్రశాంతి, సాయి, మిగతా నిందితులు పలుమార్లు మాట్లాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు అనుకున్న హత్యా ప్లాన్ మాత్రం అమలు కాలేదు. మునిరాజు బైక్‌కు నిప్పుపెట్టిన ఘటనను కూడా అదే ప్లాన్‌లో భాగంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మునిరాజు భార్య ప్రశాంతితో పాటు సాయి, ఉదయ్ కిరణ్, లీలాకృష్ణ, పృథ్వీరాజ్, హరీశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురిని కోర్టులో హాజరుపర్చగా.. వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : కల్కి భగవాన్ ఇక లేరు.. శనివారం అంత్యక్రియలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.