
Surat : సూరత్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనతో మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు ప్రియురాలి తండ్రిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యాపారవేత్త ఇంటికి వెళ్లిన యువకుడు.. అక్కడ అతడి కుమార్తె కనిపించకపోవడంతో తండ్రితో గొడవకు దిగాడు. ఆ తర్వాత తుపాకీ చూపించి ఆయనను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నగర బిల్డర్ ముఖేష్ నహతా కుమారుడు రిషభ్ నహతా అక్టోబర్ 1న తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యాపారవేత్త ఇంటికి వెళ్లాడు. అప్పటికి ఆ వ్యాపారవేత్త కుమార్తె ఇంట్లో లేదు. దీంతో తనతో ఆమె ఎందుకు మాట్లాడటం లేదని ఆమె తండ్రిని రిషభ్ ప్రశ్నించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ తర్వాత రిషభ్, అతడి స్నేహితులు తుపాకీ చూపించి వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కొన్ని గంటల్లోనే నిందితుల ఆచూకీని గుర్తించారు. సూరత్‌లోని సిటీ లైట్ ప్రాంతంలో వారిని గుర్తించి అరెస్ట్ చేసి, వ్యాపారవేత్తను సురక్షితంగా విడిపించారు.
దర్యాప్తులో రిషభ్, వ్యాపారవేత్త కుమార్తె గతంలో ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే కొంతకాలం తర్వాత ఆమె రిషభ్‌తో సంబంధాన్ని తెంచుకుని, అతడితో మాట్లాడటం కూడా ఆపేసింది. దీంతో రిషభ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తన స్నేహితురాలితో వ్యాపారవేత్త కుమార్తె ఫోన్లో అసభ్యంగా మాట్లాడిందని రిషభ్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. దీనిపై వివరణ అడిగేందుకే ఆమె ఇంటికి వెళ్లానని, అయితే ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆమె తండ్రితో మాట్లాడానని రిషభ్ పోలీసులకు చెప్పాడు.
ఈ కేసులో రిషభ్ నహతాతో పాటు అదాజన్కు చెందిన దేవ్ కేతన్ అహిర్, ఉమర్గామ్కు చెందిన లక్ష్మణ్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవ్ రిషభ్ స్నేహితుడని, నేరానికి ఉపయోగించిన తుపాకీ అతడి వద్ద ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మణ్ బిల్డర్ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ముగ్గురికీ గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.41.40 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.









