
Influencer : పంజాబ్‌లో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మధ్ సంధూ దారుణ హత్యకు గురయ్యారు. అమృత్‌సర్‌లో శనివారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న సంధూను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంధూపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియరాలేదు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మధుసూదన్ అనే పూర్తి పేరుతో ఉన్న మధ్ సంధూ మేకప్, సినిమా రంగం, జెండర్ అంశాలపై పాడ్‌కాస్ట్‌లలో తరచూ మాట్లాడేవారు. సోషల్ మీడియాలో ఆయనకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వైరల్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లగ్జరీ లుక్, మేకప్, లైఫ్‌స్టైల్ అంశాలతో పాటు సమాజంలో ఉన్న కొన్ని ఆలోచనలు, వ్యక్తుల అంగీకారం, పాప్ కల్చర్ గురించి కూడా ఆయన బహిరంగంగా మాట్లాడేవారు. తాను గే అని మధ్ సంధూ ఎప్పుడూ దాచుకోలేదు. ఈ కారణంగా సోషల్ మీడియాలో ఆయనపై కొంతకాలంగా హోమోఫోబిక్ ట్రోలింగ్ కూడా ఎదురైంది. అయితే వాటికి ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చేవారు. దేవుడు నన్ను ఇలాగే సృష్టించాడు అంటూ తన గురించి బహిరంగంగానే మాట్లాడేవారు.
ఫ్యాషన్ రంగంలో స్టైలిస్ట్‌గా, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా మధ్ సంధూ తన కెరీర్‌ను ప్రారంభించారు. పంజాబ్, ముంబైలో సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన గుర్తింపుతో ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగారు. కొన్ని పంజాబీ సినిమాల్లోనూ నటించారు. ఓయ్ భోలే ఓయ్ సిరీస్‌లో ఆయన నటించారు. ఇదిలా ఉంటే.. మధ్ సంధూ హత్యకు ఒక రోజు ముందు పంజాబ్‌లోని లూధియానాలోనూ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ముల్లాన్‌పూర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కారుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లాడీ ఖాన్ అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో మృతి చెందాడు.
లాడీ ఖాన్ మరో వ్యక్తితో కలిసి తెల్లటి హ్యుందాయ్ ఐ20 కారులో ఖంజర్వాల్ గ్రామం నుంచి మజ్రీ వైపు వెళ్తుండగా.. హ్యుందాయ్ వెర్నా కారులో వచ్చిన వ్యక్తులు వారిని వెంబడించి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న మరో వ్యక్తి రోహిత్ అలియాస్ బిల్లా కాల్పుల సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. లాడీ ఖాన్ హత్యకు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదం, గ్యాంగ్‌ల మధ్య గొడవ వంటి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనలతో పంజాబ్‌లో కలకలం రేగింది.









