VIZAG GOLD SMUGGLING
VIZAG GOLD SMUGGLING

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు.. రకరకాల దారులను ఎంచుకుంటున్నారు. అలాంటి దారినే ఎంచుకుని తాజాగా ఇద్దరు గోల్డ్ స్మగ్లర్లు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఏకంగా 5కేజీలకు పైగా బంగారాన్ని రాష్ట్రం దాటి వేరొక రాష్ట్రానికి తీసుకొస్తూ.. పోలీసులకు చిక్కారు. దాని విలువ దాదాపు రూ.8 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆ బంగారం ఎక్కడిది?.. ఎవరి కోసం తరలిస్తున్నారు?.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు?.. ఈ స్మగ్లింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు?.. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేశారు?.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీలోని విశాఖపట్నం జిల్లా పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు తనిఖీలు చేపట్టారు. పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఓ కారులో విదేశీ బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు అక్టోబర్ 8, 9 తేదీల్లో రాత్రి హైవేపై వాహనాలను జోరుగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఓ కారు అనుమానస్పదంగా కనిపించడంతో ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కారు డ్రైవర్ ఆపకుండా వేగంగా పోనిచ్చాడు.

దీంతో అధికారులు ఆ కారును వెంబడించి చివరికి సినిమా రేంజ్‌లో ఛేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం కారును ఇంచు ఇంచు తనిఖీ చేశారు. ఆఖరికి ముందు సీటు కింద భాగంలో సీక్రెట్ బాక్స్‌ గుర్తించారు. ఆ బాక్స్ ఓపెన్ చేయగా.. పోలీసులకు దిమ్మతిరిగింది. అందులో మొత్తం 5 కిలోల 832.90 గ్రాముల విదేశీ బంగారం ఉన్న మూడు ప్యాకెట్లను బయటకు తీశారు. అది అత్యంత నాణ్యత కలిగిన 24 క్యారెట్ల బంగారంగా గుర్తించారు. దాని విలువ మార్కెట్లో దాదాపు రూ.8.98 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

ప్రాథమిక విచారణలో.. ఈ బంగారాన్ని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా దేశంలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దానిని కోల్‌కతా నుంచి హైవే మార్గంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఈ ఘటనలో పట్టుబడ్డ ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసి.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.