
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతుంటాయి. తాజాగా రష్యా నుంచి భారీగా డీజిల్ దిగుమతి చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఓ సంచలన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు ఉన్నపళంగా రష్యా డీజిల్‌పై ఆంక్షలను ఏకంగా 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తూ ప్రకటన చేయడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. తమ సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా కాస్త క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన కవర్ డ్రైవ్ వ్యాఖ్యలే ఇప్పుడు అందరినీ నవ్వించేలా ఉన్నాయి. అదొక డీజిల్ డీల్ మాత్రమే. ఆ డీజిల్ కేవలం అమెరికా స్వార్థం కోసం తీసుకుంటున్నది కాదు.. మొత్తం ప్రపంచ మార్కెట్ల బాగు కోసమే అని ట్రంప్ కవర్ డ్రైవ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అధిక ధరల భారంతో కుదేలవుతున్న అంతర్జాతీయ మార్కెట్‌ను స్థిరీకరించేందుకే రష్యా రిఫైనరీల నుంచి డీజిల్ సేకరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంటే తాను చేస్తున్నది వ్యాపారం కాదని.. ప్రపంచానికి చేస్తున్న సేవ అని ఆయన కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నవంబరులో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం సామాన్యుడి నడుము విరవడంతో ఓటర్లలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల వేళ ఈ ఇంధన సెగ తన కుర్చీకి ఎసరు పెడుతుందని గ్రహించిన ట్రంప్.. రంగంలోకి దిగి పుతిన్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడి డీల్ సెట్ చేశారు. ఈ చర్చల ఫలితంగానే రష్యా డీజిల్‌పై ఆంక్షలను తాత్కాలికంగా పక్కనపెడుతూ ఏకంగా 2027 ఏప్రిల్ వరకు వెసులుబాటు కల్పించారు.
పుతిన్-ట్రంప్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యా నుంచి భారీ మొత్తంలో డీజిల్ బయటకు రానుంది. ఈ ఇంధన ప్రవాహానికి సంబంధించిన షెడ్యూల్ చాలా పెద్దదే ఉంది. ఒప్పందం కుదిరిన వెంటనే రష్యా తక్షణమే 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను అమెరికాకు అంతర్జాతీయ విపణికి సరఫరా చేస్తుంది. అలాగే వచ్చే నవంబరు నెలలో మరో 5 లక్షల టన్నుల డీజిల్‌ను రష్యా నుంచి రవాణా చేస్తారు. ఆ వెంటనే మరో 10 లక్షల టన్నుల ఇంధనం గ్లోబల్ మార్కెట్లకు చేరుకుంటుంది. రష్యాలోని డీజిల్ రిఫైనరీల సామర్థ్యం, పరిస్థితులను బట్టి స్వల్ప కాలంలోనే ఏకంగా మరో 30 లక్షల టన్నుల వరకు డీజిల్‌ను సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఒకవైపు రష్యాతో ట్రంప్ డీజిల్ ఒప్పందాలు చేసుకుంటుంటే మరోవైపు గ్లోబల్ ఆయిల్ దిగ్గజమైన సౌదీ అరేబియా పరిస్థితి కలవరకరంగా మారింది. సౌదీలోని ప్రముఖ చమురు సంస్థ అరామ్కో ప్రధాన కార్యాలయంపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు బాలిస్టిక్ క్షిపణి దాడులకు పాల్పడటంతో చమురు సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు, చమురు శుద్ధి కేంద్రాలపై దాడుల వల్ల ప్రపంచానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకే ట్రంప్ తెలివిగా రష్యా వైపు అడుగులు వేశారని భావిస్తున్నారు.









