ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు వస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 15 నుంచి 17 మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.