
BCCI : టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఈ పదవి కోసం బుధవారంతో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే, పార్థివ్ పటేల్ ఈ పదవికి దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, జూనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ అవుతారని భావించిన రమేశ్ పవార్.. ఇప్పుడు సీనియర్ జట్టు సెలెక్టర్ పదవికి పోటీ పడే అవకాశం ఉందని సమాచారం.
భారత క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్ ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా పార్థివ్ పటేల్ దరఖాస్తు చేయకపోవడానికి ఓ కారణం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బాధ్యతలు చూస్తున్న లక్ష్మణ్.. ఇకపై సెలక్షన్ కమిటీ సమావేశాలన్నింటికీ హాజరవుతారని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవల చెప్పారు. పార్థివ్ పటేల్ దరఖాస్తు చేయకపోవడంతో, తాత్కాలిక చైర్మన్గా ఉన్న ప్రజ్ఞాన్ ఓజానే కొనసాగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Also Read : యుద్ధం వస్తే ఆయుధాలు పట్టాల్సిందే.. సన్యాసులకు యోగి పిలుపు!
వచ్చే ప్రపంచకప్ వరకు అజిత్ అగార్కర్నే కొనసాగించాలని బీసీసీఐ భావించినా, అనుకున్నది జరగలేదని ఓ బోర్డు అధికారి చెప్పినట్లు నివేదిక తెలిపింది. కొత్త చైర్మన్ వస్తే ఆయన ఆలోచనలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఆలోచనలు వేరుగా ఉండొచ్చని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొత్తగా వచ్చే వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చూసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సెలక్షన్ కమిటీ బాధ్యతలను పేరున్న మాజీ క్రికెటర్లకు అప్పగించాలని బీసీసీఐ చూస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కమిటీ ఖర్చుల బడ్జెట్ను కూడా పెంచింది. ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా కమిటీలో చేరిన తర్వాత బడ్జెట్ను రూ.3 కోట్లు పెంచి రూ.17.45 కోట్లకు చేర్చింది. 2026-27 సంవత్సరానికి ఈ బడ్జెట్ను మరోసారి పెంచి రూ.19.35 కోట్లుగా నిర్ణయించింది.
ఇదిలా ఉంటే, దాదాపు 100 టెస్టు మ్యాచ్లు ఆడిన ఇద్దరు స్టార్ క్రికెటర్లను సెలెక్టర్ పదవి చేపట్టాలని బీసీసీఐ సంప్రదించినట్లు నివేదిక వెల్లడించింది. అయితే, ఆ ఇద్దరూ ఈ పదవిని చేపట్టేందుకు నిరాకరించినట్లు తెలిపింది. కానీ వాళ్లు ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
Also Read : జ్ఞానేశ్ కుమార్ను కాపాడేందుకే ఇదంతా చేస్తున్నావా.. మోదీపై అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు









