
AP Local Body Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఏ నగరంలో ఏ పార్టీ బరిలోకి దిగాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు తిరుపతి కార్పొరేషన్ విషయంలో జనసేన, బీజేపీ రెండూ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుగుతున్నాయి. అయితే సీట్ల పంపకంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
Also Read : ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!
జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు కార్పొరేషన్లను ఆ పార్టీకి ఇచ్చే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా తుది నిర్ణయం కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏలూరు మేయర్ పదవి విషయంలోనూ కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేత రెడ్డి అప్పలనాయుడు కోరుతున్నారు. మరోవైపు, టీడీపీ తరఫున చల్లా ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఏలూరు మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు పార్టీల నేతలు తమ వాదనను బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి నాయకత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
మరోవైపు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను 24 గంటల్లో అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు సమాచారం. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. త్వరలోనే విచారణ చేపట్టనుంది.
Also Read : ఏపీ స్థానిక ఎన్నికలు.. 17 కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు ఇవే!









