
నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీర ప్రాంతానికి దగ్గరగా సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనం క్రమంగా బలపడి అక్టోబర్ 24 లేదా 25 నాటికి అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక నూతన అల్పపీడనంగా మారే అవకాశముంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి అక్టోబర్ 27 నాటికి వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. దీంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న కొద్దిరోజుల పాటు వర్షాలు దంచికొట్టే ఛాన్స్ ఉంది.
శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కడప, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంత జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అల్పపీడనం, వాయుగుండం బలపడే కొద్దీ ఏపీ తీర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా మారనుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారుతోంది. అక్టోబర్ 20, 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.









