america-oregon

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. 16 ఏళ్ల బాలుడు స్కూల్‌లో కాల్పులు జరిపి ముగ్గురు పిల్లలతో సహా ఒక ఉపాధ్యాయుడిని చంపేశాడు. ఈ ఘటనలో ఉపయోగించిన షాట్‌గన్‌ను అతని తల్లి కొనిచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

16 ఏళ్ల గ్రిఫిన్ జె. జాన్ II బెండ్‌లోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లోకి వెళ్లే ముందు ఒక పికప్ ట్రక్కుపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ ట్రక్కు డ్రైవర్ భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడు స్కూల్‌ వైపు వెళ్లి అక్కడ క్లోజ్ చేసిన గాజు గ్లాసులపై కాల్పులు జరిపి లోపలికి ప్రవేశించాడు. అనంతరం ఫస్ట్ క్లాస్ రూమ్‌లోకి వెళ్లి.. లోపల ఉన్నవారిపై కాల్పులు జరిపాడు.

కాల్పులు జరిగిన సమయంలో ఆ క్లాస్ రూమ్‌లో మొత్తం 9 మంది ఉండగా.. అందులో ముగ్గురు చిన్నారులు, 25 ఏళ్ల ఉపాధ్యాయురాలు మేగన్ లాంబర్ట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 7 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. అనంతరం జియామాంకో అనే వ్యక్తి ఆ రూమ్‌లోకి వెళ్లి.. నిందితుడ్ని కాల్చి చంపాడు. అయితే నిందితుడికి ఆ గన్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

నిందితుడి తల్లి షాంటె నికర్సన్ ఆ గన్‌ కొనిచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ఆగస్టులో కొడుకు బర్త్ డే కావడంతో.. అతడి కోరిక మేరకు మేవరిక్ 88 పంప్-యాక్షన్ 12-గేజ్ షాట్‌గన్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఆ యువకుడు ఈ దాడి ఎందుకు చేసాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.