
బాగా ఎండలు కాసే ఎడారి ప్రాంతం.. తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి.. అలాంటి చోట వ్యవసాయం చేయడమే కష్టం అనుకుంటే.. ఏకంగా చేపల పెంపకం చేపట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఇజ్రాయెల్. దేశ విస్తీర్ణం చాలా చిన్నదైనప్పటికీ అందులో 60 శాతానికి పైగా భూభాగం నెగెవ్, జుడియన్, ఆరావా, జిన్ వంటి తీవ్రమైన ఎడారులు ఆక్రమించాయి. అయినప్పటికీ తమ వద్ద ఉన్న పరిమిత వనరులను, సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటూ ఇజ్రాయెల్ వ్యవసాయంలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచం సూపర్ ఎల్‌నినో పిడికిట చిక్కి, రానున్న నెలల్లో కరవు ఖాయమని హెచ్చరికలు వస్తున్న వేళ, ఇజ్రాయెల్ వినూత్న వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తోంది.
ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం నీటి వనరులపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. ఇష్టారాజ్యంగా బోర్లు, బావులు తవ్వడం నేరం. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏకంగా వాటర్ పోలీసులను ఏర్పాటు చేశారు. రైతులు తమకు కేటాయించిన నీటి కంటే తక్కువ వాడుకుంటే వారికి వాటర్ క్రెడిట్స్ లభిస్తాయి. వీటిని నగదుగా కూడా మార్చుకోవచ్చు. మరోవైపు ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిలో దాదాపు 86 శాతాన్ని శుద్ధి చేసి తిరిగి వ్యవసాయానికి వాడుతున్నారు. రివర్స్ ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా సముద్రపు నీటిని డీశాలినేషన్ చేసి చాలా తక్కువ ఖర్చుతో మంచి నీరుగా మారుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు నీటి పొదుపు చర్యలను నేర్పిస్తారు. ఇక్కడ నీటిని ఆదా చేసే డ్యూయల్ ఫ్లష్ టాయిలెట్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నీటి ప్లాంట్లపై శత్రు దేశాలు సైబర్ దాడులు చేయకుండా ఇజ్రాయెల్ సైబర్ ఇంటెలిజెన్స్ విభాగం యూనిట్ 8200 24 గంటలూ రక్షణ కల్పిస్తుంది.
సముద్ర తీరాల్లో ఎడారులున్న అరుదైన భౌగోళిక పరిస్థితి ఇజ్రాయెల్‌ది. డెడ్‌సీ, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం వంటి వనరులతో పాటు సీ ఆఫ్ గాలిలీ కూడా ఉంది. డెడ్‌సీ తీరంలో జుడియన్ ఎడారి, ఎర్ర సముద్రం వద్ద నెగెవ్ ఎడారి ఉన్నాయి. ఇక్కడి నీరు వందల మీటర్ల లోతులో ఉండి దాదాపు 37 డిగ్రీలకు పైగా వేడి, స్వల్ప ఉప్పదనంతో ఉంటుంది. ఈ నీటిని పైపుల సాయంతో తోడి ప్రత్యేక ట్యాంకుల్లో నింపి.. వీటిలో తిలాపియా, సీబాస్, బరముండి వంటి చేపలను, కొన్ని రకాల రొయ్యలను పెంచుతారు. ఆక్సిజన్ పంపిస్తూ వాటర్ సైక్లింగ్ పద్ధతిలో నీటిని వాడుకుంటారు. చేపల విసర్జకాలతో కూడిన ఈ పోషకాల నీటిని ఆలివ్ తోటలకు సహజ ఎరువుగా ఉపయోగిస్తారు. స్థానిక సంప్రదాయాల వల్ల రొయ్యలకు దేశీయంగా డిమాండ్ తక్కువగా ఉండటంతో వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి విదేశీ కరెన్సీ సంపాదిస్తున్నారు.
ఇజ్రాయెల్ తన భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా పంటలలో ఎన్నో మార్పులు చేసింది. కింగ్ ఆఫ్ డేట్స్‌గా పిలిచే మెడ్జూల్ ఖర్జూర తోటలను ఎడారుల్లో పండిస్తూ వీటి ఎగుమతిలో ప్రపంచంలోనే భారీ మార్కెట్ షేర్‌ను దక్కించుకుంది. తక్కువ నీటితో పండేలా చెర్రీ టమాటోలు, సుదీర్ఘకాలం నిల్వ ఉండేలా క్యాప్సికం పంటను జన్యుమార్పులతో సృష్టించింది. సూపర్ స్వీట్ మిరపకాయలను కూడా ఇక్కడి కంపెనీ తయారూ చేసింది. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పామాయిల్ సాగుకు బదులు ఆలివ్ సాగుకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయానికి అత్యధిక శాతం రీసైక్లింగ్ నీటినే వినియోగిస్తారు. మట్టి కూడా వాడని ప్రత్యేక పద్ధతుల్లో డిజర్ట్ రోజ్‌లను సాగు చేసి యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉప్పునీటిలో పండే క్యారట్, నీటి వృథాను తగ్గించే పండ్ల రకాల సాగుకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు.
ఇజ్రాయెల్ వ్యవసాయంలో ద్రాక్ష తోటల సాగు మరో ఎత్తు. ఇక్కడి పండ్ల నుంచి ప్రపంచ స్థాయి నాణ్యతతో వైన్ ఉత్పత్తి చేస్తారు. నెగెవ్ ఎడారి మధ్యలో కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ, సెన్సర్ల ద్వారా నీటి వృథాను అరికట్టి ద్రాక్ష తోటలను పెంచారు. ఈ ఎడారిలో 60కి పైగా వైన్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఏటా 10 లక్షలకు పైగా బాటిళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలోనే వైన్ నాణ్యతలో నెగెవ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. సరైన ఆలోచన, అత్యుత్తమ సాంకేతికత ఉంటే ఎడారిని కూడా రత్నాల గనిగా మార్చవచ్చని ఇజ్రాయెల్ నిరూపించింది.









