
TMC : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) లక్ష్యంగా జరుగుతున్న వరుస దాడులు, అరెస్టులు అక్కడి రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా వేడెక్కించాయి. ఇటీవల ఆ పార్టీ కీలక నేత, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో దారుణంగా దాడి జరిగిన సంఘటన మరువక ముందే.. వారం తిరక్కుండానే మరో ముగ్గురు కీలక నేతలపై దాడులు జరగడం కలకలం రేపింది. పార్టీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మజుందార్‌పై కోల్‌కతాలో కోడిగుడ్లతో దాడి జరగడం, చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీపై రాయి విసరడం, మరోవైపు బాంబు పేలుడు కేసులో మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లాను ఎన్‌ఐఏ (NIA) అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
https://x.com/ChotaNewsApp/status/2063069978769932399
ఆస్తి ఆక్రమణ కేసులో అరెస్ట్ అయిన టీఎంసీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మజుందార్‌ను పోలీసులు సదరు వివాదాస్పద స్థల పరిశీలనకై కోల్‌కతాకు తీసుకువెళ్లినప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ ఉన్న కొంతమంది నిరసనకారులు ఆయనపై ఒక్కసారిగా కోడిగుడ్లతో దాడికి తెగబడటంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ అవమానకర దాడితో తీవ్ర ఆగ్రహానికి లోనైన జయప్రకాష్ మజుందార్.. నిరసనగా తాను కారు దిగే ప్రసక్తే లేదంటూ లోపలే భీష్మించుకు కూర్చున్నారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన గంటల వ్యవధిలోనే, హూగ్లీ జిల్లా చండితాలా పోలీస్ స్టేషన్ ఆవరణలో టీఎంసీ -బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో టీఎంసీ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ తలకు బలమైన రాయి తగిలి గాయపడ్డారు. కాషాయ కండువాలు కప్పుకున్న బీజేపీ కార్యకర్తలే తనపై దాడి చేశారని, పోలీసులు మూగప్రేక్షకులుగా నిలబడ్డారని ఆరోపిస్తూ కల్యాణ్ బెనర్జీ స్టేషన్ ముందే ధర్నాకు దిగారు.
https://x.com/MeghUpdates/status/2062923728003183020
ఈ రాజకీయ హింసపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మమతా బెనర్జీకి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. గాయపడిన అభిషేక్ బెనర్జీకి మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్‌కు తరలిద్దామని ఆయన ప్రతిపాదించినట్లు మమత పేర్కొన్నారు. అయితే, ఈ దాడుల వెనుక భిన్నమైన కోణాలు వెలుగుచూస్తున్నాయి. అభిషేక్ బెనర్జీపై దాడి చేసింది టీఎంసీకే చెందిన మాజీ ఎమ్మెల్సీ లవ్లీ మైత్రా అనుచరులేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చి ఐదుగురిని అరెస్ట్ చేయగా, టీఎంసీ అంతర్గత విభేదాల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఎద్దేవా చేశారు.
టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లా అరెస్ట్
ఇలాంటి రాజకీయ దాడుల గందరగోళం నడుస్తుండగానే, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శనివారం తెల్లవారుజామున ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లా భాంగర్ పరిధిలోని దక్షిణ బమునియాలో ఎన్నికల ముందు (మార్చి 19న) జరిగిన నాటు బాంబుల పేలుడు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లాను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాత్రి పూట ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఒకవైపు ప్రతిపక్షాల దాడులు, మరోవైపు అంతర్గత కుమ్ములాటలు, ఇంకోవైపు కేంద్ర సంస్థల అరెస్టులతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి.









