MLA Anant Singh : బిహార్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ రాజకీయంగా ఇక పని అయిపోయింది అని కామెంట్ చేయడంతో పాటు, జేడీయూకు కూడా భవిష్యత్తు లేదని అన్నారు. అంతేకాదు.. అవసరమైతే తానే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. జేడీయూ నుంచి బహిష్కరణ తర్వాత తొలిసారిగా పాట్నాలో బహిరంగంగా కనిపించిన అనంత్ సింగ్.. పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

జేడీయూ వ్యవస్థాపకుడు నితీశ్ కుమార్ లేకపోతే ఆ పార్టీకి అసలు భవిష్యత్తు ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీని నడుపుతున్న నేతలకు సొంతంగా ఎలాంటి రాజకీయ బలం లేదని విమర్శించారు. “నన్ను పార్టీ నుంచి బహిష్కరించడంపై నాకు ఎలాంటి బాధ లేదు. ఆ పార్టీ నితీశ్ కుమార్‌ది. ఆయనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయనే లేనప్పుడు ఆ పార్టీకి ఏమి మిగిలింది? నన్ను బహిష్కరించిన వ్యక్తికి అసలు విలువ లేదు” అని అనంత్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాబోయే ఎన్నికల్లో జేడీయూ కనీసం 10 సీట్లు కూడా గెలవడం కష్టమేనని అనంత్ సింగ్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి వచ్చే ఫలితాలే తన బహిష్కరణ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించిందో తెలియజేస్తాయని అన్నారు. తనను పార్టీ నుంచి తొలగించిన విషయం కూడా జేడీయూ నుంచి అధికారికంగా కాకుండా మీడియా ద్వారా తెలుసుకున్నానని అనంత్ సింగ్ తెలిపారు. అయితే ఈ నిర్ణయం తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు.

మరో రాజకీయ పార్టీలో చేరే ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు. నేను ఎక్కడికీ ఎందుకు వెళ్లాలి? నేనే సొంతంగా పార్టీ పెట్టుకుంటానని అనంత్ సింగ్ ప్రకటించారు. ఎన్నికలు జరిగిన తర్వాత జేడీయూ తనను బహిష్కరించిన నిర్ణయం ప్రభావం ఏంటో తెలుసుకుంటుందని వ్యాఖ్యానించారు.జేడీయూ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ.. నితీశ్ కుమార్‌తో తన వ్యక్తిగత సంబంధాలు మాత్రం బాగానే ఉన్నాయని అనంత్ సింగ్ స్పష్టం చేశారు. మాజీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తాను ఇప్పటికీ గౌరవిస్తానని, ఆయనను కలవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

తనను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత రాజకీయంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ప్రశ్నకు కూడా అనంత్ సింగ్ ప్రజలనే తుది నిర్ణయాధికారులుగా పేర్కొన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయం సరైందా, తప్పా అనేది ప్రజలే తేలుస్తారని అన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.