
JIO IPO Allotment Today : దేశంలోనే భారీ ప్రాధాన్యం సంతరించుకున్న జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30,213 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కేటాయింపుల ప్రక్రియ నేటితో పూర్తవుతోంది. రికార్డు స్థాయిలో 1.38 కోట్ల దరఖాస్తులు సాధించి గ్లోబల్ రికార్డు సృష్టించిన ఈ ఐపీఓ షేర్ల కోసం పెట్టుబడిదారులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సాయంత్రం నాటికి అలాట్మెంట్ ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థులకు షేర్లు కేటాయిస్తే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
ఈ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగిసింది. మొత్తం ఆఫర్ చేసిన 19.75 కోట్ల షేర్లకు గాను దాదాపు 421.87 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. అంటే ఈ ఐపీఓ మొత్తం మీద 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే ఇది పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. క్యూఐబీ విభాగం 70.55 రెట్లు, ఎన్ఐఐ విభాగం 14 రెట్లు, రిటైల్ పెట్టుబడిదారుల విభాగం 2.72 రెట్ల మేర సబ్స్క్రిప్షన్లు సాధించాయి. ఉద్యోగుల కోటా 2.93 రెట్లు, వాటాదారుల కోటా 7.60 రెట్లు పూర్తి అయ్యాయి.
Also Read : పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం!
కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత పెట్టుబడిదారులు ఇష్యూ రిజిస్ట్రార్ అయిన కేఫిన్ టెక్నాలజీస్ అధికారిక పోర్టల్‌లో లేదా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లలో తమ స్టేటస్‌ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కేఫిన్ వెబ్సైట్లో ‘Jio Platforms Limited’ను ఎంచుకుని మీ పాన్ కార్డ్, అప్లికేషన్ నంబర్ లేదా డీమ్యాట్ ఖాతా వివరాలను నమోదు చేయడం ద్వారా అలాట్మెంట్ జరిగిందో లేదో తెలుసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లలోని ఐపీఓ అప్లికేషన్ స్టేటస్ పేజీలో కూడా ఈ వివరాలను సరిచూసుకోవచ్చు.
షేర్లు కేటాయించని అభ్యర్థులకు వారి నిధులను వాపసు చేయడం, షేర్లు పొందిన వారికి వాటిని డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయడం అక్టోబర్ 27న జరుగుతుంది. ఇక జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు అక్టోబర్ 28 నాడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలలో అధికారికంగా లిస్ట్ కానున్నాయి. ఈ ఇష్యూ ధరల శ్రేణిని రూ. 1,065 నుంచి రూ. 1,119గా నిర్ణయించారు. కనీస అప్లికేషన్ లాట్ పరిమాణం 12 షేర్లుగా ఉన్నందున రిటైల్ పెట్టుబడిదారులకు గరిష్ట ధర వద్ద రూ. 13,428 పెట్టుబడి అవసరమైంది.
ఐపీఓ అలాట్మెంట్ ముగిసే సమయానికి గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 247గా ట్రేడ్ అవుతోంది. ఇది ఇష్యూ గరిష్ట ధర రూ. 1,119పై దాదాపు 22.07 శాతం ప్రీమియంను సూచిస్తోంది. అయితే జీఎంపీ అనేది కేవలం ఒక అనధికారిక మార్కెట్ సూచిక మాత్రమేనని.. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ అయ్యే సమయానికి మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల డిమాండ్‌ను బట్టి అసలు లిస్టింగ్ ధర మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read : 6 నెలల్లో 23 మరణశిక్షలు.. సంచలన తీర్పులిచ్చిన జడ్జి బదిలీ









