ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం(Purvanchal Expressway Accident) జరిగింది. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది, అధికారులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ముప్పు వాటిల్లకపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

Also Read : నేడే జియో ఐపీఓ అలాట్‌మెంట్.. కేటాయింపు స్టేటస్, జీఎంపీ వివరాలు ఇవే!

లక్నో నుంచి సుల్తాన్‌పూర్ వైపు వెళ్తున్న సమయంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలోని హలియాపూర్ ప్రాంతంలో, 91వ కిలోమీటర్ మైలురాయి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే వరుసలో వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌లోని ఐదు వాహనాలతో పాటు ఒక అంబులెన్స్ ఊహించని విధంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాహనాలు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు పార్టీ కార్యకర్తలు, అధికారులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రాహుల్ గాంధీని సుల్తాన్‌పూర్ పర్యటనకు పంపించారు.

రాహుల్ గాంధీ ఒక పరువు నష్టం కేసు విచారణలో భాగంగా సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఎదుట హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 2018లో బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యల వల్ల తమ పార్టీ ప్రతిష్ట దిగజారిందని, వ్యక్తిగతంగా తాను బాధపడ్డానని పేర్కొంటూ సుల్తాన్‌పూర్ జిల్లా హనుమాన్‌గంజ్‌కు చెందిన బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

Also Read : సరయూ నది తీరంలో.. ప్రధాని మోదీ ఫొటోకి చేతబడి!

ఈ సుదీర్ఘ కేసు విచారణలో భాగంగా సుల్తాన్‌పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు 2023 డిసెంబర్ 16న రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. పూర్తి నిర్దోషినని కోర్టుకు తెలిపారు. ఆ తదనంతరం ఇరుపక్షాల సాక్ష్యాలు, వాంగ్మూలాల విచారణ కొనసాగింది.

కేసు విచారణ సందర్భంగా ఫిర్యాదుదారు విజయ్ మిశ్రా.. రాహుల్ గాంధీ వాయిస్ శాంపిల్ సేకరించి సరిపోల్చాలని పిటిషన్ వేసినప్పటికీ, ట్రయల్ కోర్టు దానిని తిరస్కరించింది. ఆ తర్వాత సెషన్స్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు కూడా ఆ పిటిషన్‌ను కొట్టివేశాయి. తాజాగా సాక్ష్యాధారాల విచారణ మరియు తుది వాదనలు పూర్తి కావడంతో, ఈ రోజు సుల్తాన్‌పూర్ కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు సమయానికి న్యాయస్థానంలో ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలోనే రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ఈ ప్రమాదం ఎదురైంది.