
Nicki minaj: అమెరికా నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు ట్రంప్ మిషిగన్‌లో నిర్వహించిన రిపబ్లికన్ల ర్యాలీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఈవెంట్‌కు పాప్ స్టార్ నిక్కీ మినాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రంప్‌కు తాను నంబర్ వన్ ఫ్యాన్ అని చెప్పుకున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయనతో కలిసి ప్రయాణించి, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఇంటర్వ్యూ గురించి ఆమె ‘X’లో పోస్ట్ చేశారు.
పోర్ట్ హురాన్లో జరిగిన ర్యాలీలో నిక్కీ, ట్రంప్ అలాగే స్థానిక రిపబ్లికన్ అభ్యర్థుల పేర్లతో నినాదాలు చేస్తూ క్రౌడ్‌ను హుషారెత్తించారు. స్టేజ్ మీద నిక్కీ అందాన్ని పొగిడిన ట్రంప్, తన స్పీచ్‌లో ఆమె శరీరాకృతిపై పచ్చిగా మాట్లాడి కాంట్రవర్సీకి తెరతీశారు. గతంలో ఒహియో సెనేటర్ జాన్ హస్టెడ్ బాడీ ఫిజిక్‌పై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ—పురుషుల గురించి అలా మాట్లాడనని, మహిళల గురించే మాట్లాడతానని చెబుతూ నిక్కీ మినాజ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే ఆమెను నిలబడాలని కోరగా, క్రౌడ్ అరుపుల మధ్య ఆమె లేచి నిలబడ్డారు. తర్వాత ట్రంప్ “నిక్కీ ఫీల్ అవ్వలేదని ఆశిస్తున్నా” అంటూ సారీ చెప్పారు. గతంలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను విమర్శించిన నిక్కీ, ప్రస్తుతం ఆయనకు గట్టి మద్దతుదారుగా మారడం గమనార్హం.
మరోవైపు, మిషిగన్ సెనెట్ ఎన్నికల పోటీ హోరాహోరీగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయ్యద్, రిపబ్లికన్ మైక్ రోజర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. శనివారం బరాక్ ఒబామా ఎల్-సయ్యద్‌కు మద్దతుగా ప్రచారం చేయగా, ఆదివారం ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్-సయ్యద్ మతాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లను పలువురు ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలుగా పేర్కొంటున్నారు. దీనిపై ఎల్-సయ్యద్ కౌంటర్ ఇస్తూ.. పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ఖర్చుల వంటి ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ట్రంప్ తన మతాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.









