
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు యూఎస్ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 1993 నవంబర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించిన వివరాలను డెమోక్రటిక్ పార్టీ రూపొందించిన తాజా రిపోర్ట్ వెలుగులోకి తెచ్చింది. యూఎస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీలోని డెమోక్రాట్లు విడుదల చేసిన 53 పేజీల ఈ డాక్యుమెంట్‌లో ట్రంప్‌పై గతంలో వచ్చిన ఆరోపణలతో పాటు, వివాదాస్పద వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయనకున్న సంబంధాల వివరాలను కూడా ప్రస్తావించారు.
ఈ రిపోర్ట్ ప్రకారం.. క్యూల్‌కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో జరిగిన బ్యూటీ కాంటెస్ట్ సందర్భంగా ట్రంప్‌తో మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఆమెకు యూఎస్ వీసా ఇప్పిస్తానని, న్యూయార్క్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేలా హెల్ప్ చేస్తానని ట్రంప్ ప్రామిస్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఒకరోజు ట్రంప్ ప్రతినిధి ఆమెను హోటల్ పై అంతస్తులోని రూమ్‌కు పిలిపించారని, అక్కడ ఎప్‌స్టీన్‌తో గడిపిన అనంతరం ట్రంప్ ఆమెపై బలవంతంగా రేప్‌కు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నారు.
ఈ దాడిలో ఆమె దుస్తులు చిరిగిపోవడమే కాకుండా శరీర భాగాల్లో బ్లీడింగ్, బలమైన గాయాలు అయ్యాయని క్యూల్ ఇంటర్వ్యూలలో వెల్లడించినట్లు డెమోక్రాట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తూ, మళ్లీ వీసా, యూనివర్సిటీ సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఆమెతో ప్రమాణం చేయించుకున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది.
అయితే, ఈ తీవ్రమైన ఆరోపణలను వైట్‌హౌస్ వర్గాలు పూర్తిగా కొట్టిపారేశాయి. ట్రంప్ పాపులారిటీని దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు చేస్తున్న రాజకీయ కుట్ర ఇదని విమర్శించాయి. మరోవైపు, ఈ వివరాలు బయటకు రావడంతో ట్రంప్‌పై తక్షణమే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేపట్టాలని డెమోక్రాట్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.









