భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ సరికొత్త చరిత్ర సృష్టించాయి. దసరా, నవరాత్రి పండుగల షాపింగ్, ప్రధాన ఈ-కామర్స్ సేల్స్ దెబ్బకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 25.47 బిలియన్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 23% భారీ గ్రోత్‌ను నమోదు చేసింది.

లావాదేవీల విలువ పరంగా చూస్తే, అక్టోబర్‌లో మొత్తం రూ. 31.53 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 16% వార్షిక వృద్ధిని సూచిస్తుంది. సెప్టెంబర్ నెలలో 24.07 బిలియన్ లావాదేవీల ద్వారా రూ. 29.37 లక్షల కోట్లు నమోదు కాగా, అక్టోబర్‌లో ఆ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

సెప్టెంబర్‌లో సగటున రోజుకు 802 మిలియన్లుగా ఉన్న లావాదేవీలు, అక్టోబర్‌లో 822 మిలియన్లకు పెరిగాయి. అంతేకాకుండా, చరిత్రలోనే తొలిసారిగా రోజువారీ సగటు లావాదేవీల విలువ రూ. 1 లక్ష కోట్లను దాటి, రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా దసరాకు ముందు అక్టోబర్ 9న ఒక్కరోజే అత్యధికంగా 873 మిలియన్ల లావాదేవీలు నమోదై, అక్టోబర్ 19 వరకు భారీ స్థాయిలో కొనసాగాయి.

మెమరీ చిప్స్ కొరత వల్ల స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ ధరలు 30-40% పెరిగినప్పటికీ, కస్టమర్ల కొనుగోలు ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వినియోగదారులు సాధారణ ఖర్చులతో పాటు పండుగ షాపింగ్, ఫుడ్, ట్రావెల్ వంటి పెద్ద పేమెంట్స్ కోసం కూడా యూపీఐని విస్తృతంగా వాడారని క్యాష్‌ఫ్రీ కో-ఫౌండర్ రీజు దత్తా వివరించారు.

నవంబర్‌లో ధంతేరాస్, దీపావళి వంటి భారీ పండుగలు ఉండటంతో యూపీఐ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ఫిన్‌టెక్ రంగ నిపుణులు భావిస్తున్నారు. ధంతేరాస్ సందర్భంగా బంగారం, వెండి మరియు ఇతర విలువైన సాంప్రదాయ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి, హై-వాల్యూ ట్రాన్సాక్షన్స్ గణనీయంగా పెరిగే చాన్స్ ఉందని ఫైబ్ ఎండీ అక్షయ్ మెహ్రోత్రా అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో భారత డిజిటల్ ఎకానమీ మరిన్ని కొత్త శిఖరాలను అందుకోనుందనడంలో సందేహం లేదు.