
వ్యక్తుల అరెస్టులు, పోలీస్ కస్టడీ, కోర్టులో హాజరుపరిచే అంశాలపై సుప్రీంకోర్టు కీలకమైన రూలింగ్ ఇచ్చింది. పోలీసు అధికారులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి 24 గంటల డెడ్‌లైన్ ప్రారంభమవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రికార్డుల్లో అధికారికంగా అరెస్ట్ చూపించిన సమయం నుంచి కాకుండా, వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నప్పటి నుంచే ఈ కౌంట్‌డౌన్ మొదలవుతుందని తేల్చిచెప్పింది.
పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత, అధికారిక అరెస్టు వేరంటూ గంటల తరబడి స్టేషన్లలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల ప్రకారం ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా ఆపడం లేదా న్యాయపరమైన ప్రక్రియను డిలే చేయడం ఏమాత్రం చెల్లదు. “అదుపులోకి తీసుకోవడం వేరు, అరెస్టు వేరు” అంటూ సాంకేతిక కారణాలు చూపి 24 గంటల నిబంధనను దాటవేయడానికి అధికారులకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది.
మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు
నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు మేజిస్ట్రేట్లు పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా కోర్టు స్పష్టం చేసింది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న అసలు తేదీ, ఖచ్చితమైన సమయాన్ని మేజిస్ట్రేట్లు రికార్డుల్లో నమోదు చేయాలి.
24 గంటల గడువు రూల్‌ను పోలీసులు ఖచ్చితంగా పాటించారో లేదో స్వయంగా పరిశీలించాలి.
హైకోర్టుల తీర్పులు కొట్టివేత
ఈ 24 గంటల నిబంధన విషయంలో గతంలో ఒరిస్సా, మద్రాస్, కేరళ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పూర్తిగా తిరస్కరించింది. అధికారిక అరెస్టుకు ముందున్న కస్టడీ సమయాన్ని మినహాయించడానికి ఆయా కోర్టులు అనుమతించగా, సుప్రీం ధర్మాసనం దాన్ని తప్పుబట్టింది. అరెస్ట్ చేసిన స్పాట్ నుంచి కోర్టు వరకు ప్రయాణానికి పట్టే సమయం మినహా, వేరే ఏ ఇతర మినహాయింపులు చెల్లవని అత్యున్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.









