White House:అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలించాయి. కాంగ్రెస్ పరిధిలోని ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలోనూ డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో వాషింగ్టన్ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఘోర పరాజయం వైట్‌హౌస్ అంతర్గత విబేధాలను బహిర్గతం చేయడమే కాకుండా, ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య అభిప్రాయభేదాలను తీవ్రస్థాయికి చేర్చింది.

ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణమా?

రిపబ్లికన్లు 2 సభల్లోనూ ఆధిపత్యాన్ని కోల్పోవడంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్‌లో ఓపెన్‌గా స్పందించారు. రాబోయే ఆరేళ్ల పాటు సెనెట్‌లో మెజారిటీని కోల్పోవడానికి ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమని పేర్కొనడం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనూ, ఫలితాల తర్వాత కూడా ఈ మిలిటరీ యాక్షన్‌ను సమర్థించుకుంటూనే వచ్చారు. వాన్స్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ, ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోగలనని, సైనిక చర్య ప్రభావం ఎన్నికలపై పడిందని అంగీకరించినప్పటికీ, యుద్ధం సమర్థనీయమేనని తేల్చి చెప్పారు.

లక్షకు పైగా ఓటర్లపై నిర్వహించిన సర్వే ప్రకారం:

  • 60% మంది అమెరికన్లు ఇరాన్‌పై జరిగిన దాడిని తప్పుపట్టారు. యుద్ధం పట్ల అసంతృప్తితో ఉన్న ఈ ఓటర్లే డెమోక్రాట్లకు భారీగా ఓట్లు వేశారు.

  • కేవలం యుద్ధమే కాకుండా, దాదాపు 50% మంది ఓటర్లు విపరీతమైన ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అవినీతిని కూడా కీలక సమస్యలుగా పరిగణించారు.

  • డెమోక్రాట్ మద్దతుదారులంతా యుద్ధాన్ని వ్యతిరేకించగా, రిపబ్లికన్ బేస్‌లో ప్రతి 10 మందిలో 8 మంది ట్రంప్ నిర్ణయానికి మద్దతు తెలిపారు.

2028 ప్రెసిడెన్షియల్ రేసుపై వాన్స్ దృష్టి

గతంలో ఇరాక్ యుద్ధంలో మెరైన్‌గా పనిచేసిన జేడీ వాన్స్, మొదటి నుంచీ విదేశీ సైనిక జోక్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా ఓటమి తర్వాత ఆయన కేవలం యుద్ధాన్ని మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణం, ఇజ్రాయెల్ సంబంధాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీ అంశాలను లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2028 అధ్యక్ష ఎన్నికల రేసును దృష్టిలో ఉంచుకునే వాన్స్ ట్రంప్ విధానాలకు భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

గవర్నర్ ఎన్నికల్లోనూ డెమోక్రాట్ల హవా

కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లారు. మొత్తంగా చూస్తే, ఈ ఫలితాలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారగా, రిపబ్లికన్ పార్టీ ఈ పరాజయం నుంచి ఎలా కోలుకుంటుందో, ట్రంప్-వాన్స్ విభేదాలు భవిష్యత్తులో ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.