పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ జ్వాలలు క్షణక్షణానికి మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై విరుచుకుపడ్డారు. ఏకంగా ఆరు కీలక లక్ష్యాలను టార్గెట్ చేస్తూ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో ఆందోళనకర రీతిలో దాడులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ స్వయంగా అధికారికంగా ప్రకటించడంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగుతోంది.

తమ సైన్యం చేపట్టిన మొదటి ఆపరేషన్‌లో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అత్యంత భద్రత కలిగిన ‘కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం’ను దెబ్బతీశామని హూతీలు తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సౌదీ జాతీయ చమురు సంస్థ ‘ఆరామ్‌కో’కు చెందిన భారీ చమురు నిల్వ ట్యాంకులు, డిస్టిలేషన్ టవర్‌ను క్షిపణులతో విజయవంతంగా హిట్ చేశామని వెల్లడించారు. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి వ్యవస్థపై ఈ దాడులు జరగడం గ్లోబల్ మార్కెట్లను భయాందోళనలకు గురిచేస్తోంది.

మొదటి ఆపరేషన్ సక్సెస్ అయిన వెంటనే హూతీ బలగాలు తమ దాడి తీవ్రతను మరింత పెంచాయి. రెండవ ఆపరేషన్‌లో భాగంగా ఖురైస్ ప్రాంతంలో ఉన్న భారీ చమురు స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత దవాద్మి ప్రాంతంలో ఉన్న ప్రాధాన్యత కలిగిన చమురు పంపింగ్ స్టేషన్ నెం.8ను లక్ష్యంగా చేసుకుని మూడో దాడికి పాల్పడ్డాయి. ఈ దాడులతో సౌదీ అరేబియాలోని ప్రధాన చమురు మౌలిక సదుపాయాలు తీవ్ర ముప్పులోకి వెళ్లాయి.

మిగిలిన మూడు ఆపరేషన్లలో సౌదీ అరేబియా సైనిక సిబ్బంది, వారి కీలక స్థావరాలను హూతీలు టార్గెట్ చేశారు. ముఖ్యంగా నజ్రాన్ ప్రాంతంలో ఉన్న సౌదీ నేషనల్ గార్డ్ ఆర్మీ క్యాంప్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ దాడుల వల్ల అక్కడ అధిక సంఖ్యలో సౌదీ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని యాహ్యా సరీ స్పష్టం చేశారు.