బ్రిటిష్ వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ, యూకేలోని ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఒక సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. గత వందేళ్లకు పైగా తమ ప్రసిద్ధ పిట్ రివర్స్ మ్యూజియం లో భద్రపరిచిన నాగా తెగలకు చెందిన 39 మంది పూర్వీకుల అవశేషాలను అధికారికంగా తిరిగి అప్పగించింది.

Also Read : అసలేం జరుగుతోంది: అమెరికా రక్షణ మంత్రిపై వేటు.. ఎవరీ పీట్ హెగ్సెత్?

ఆక్స్‌ఫర్డ్‌లో అప్పగింత కార్యక్రమం

మ్యూజియంలో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ అధికారిక కార్యక్రమంలో ‘ఫోరం ఫర్ నాగా రికన్సిలియేషన్ ’, అలాగే ‘నాగా హోహో’ ప్రతినిధులకు ఈ అవశేషాలను అందజేశారు. ఈ అవశేషాలను గౌరవప్రదంగా స్వస్థలమైన నాగాలాండ్‌కు తరలిస్తున్నట్లు FNR ప్రతినిధులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఐరీన్ ట్రేసీ, ఈ రీపాట్రియేషన్ ప్రక్రియ నాగా ప్రజలకు, యూనివర్సిటీకి మధ్య సరికొత్త మైత్రికి నాంది పలికిన ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.

గతాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం

ఈ అప్పగింత వేళ వలస పాలన నాటి గాయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బ్రిటిష్ పాలన సాగిన రోజుల్లో తమ సొంత గ్రామాన్ని వలస సైనికులు ఎలా తగులబెట్టారో FNR ప్రతినిధి వైసియర్ సాన్యు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. శతాబ్దాల కిందట బలవంతంగా తరలించిన పూర్వీకుల ఆనవాళ్లు ఎట్టకేలకు తమ సొంత గడ్డను తాకడం నాగా ప్రజలకు దక్కిన గొప్ప సాంస్కృతిక విజయమని పలువురు భావిస్తున్నారు.

Also Read : మళ్లీ మొదలైన టెన్షన్.. ఎవరికీ అంతుచిక్కని కరోనా కొత్త సైలెంట్ మహమ్మారి.. WHO స్ట్రాంగ్ వార్నింగ్!

కోహిమాలో ఖననానికి ఏర్పాట్లు

స్వదేశానికి చేరుకుంటున్న పూర్వీకుల అవశేషాలకు సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాగాలాండ్ రాజధాని కోహిమాలోని ‘నాగా సాలిడారిటీ పార్కు’లో పూర్తి ఆచారాల ప్రకారం ఈ అవశేషాలను శాశ్వతంగా ఖననం చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరే సమయం వచ్చిందని స్థానిక గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.