జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అఖ్రాన్ సమీపంలోని సెక్యూరిటీ చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న CRPF జవాన్లను టార్గెట్ చేస్తూ ముష్కరులు ఆకస్మిక కాల్పులకు తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

Also Read : వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. బ్లూ టిక్స్ పడకుండానే మెసేజ్ చదవచ్చు.. ఎలాగంటే?

మధ్యాహ్నం పూట ఆకస్మిక కాల్పులు

కుల్గాం పరిధిలోని నాకా వద్ద CRPF సిబ్బంది ఎప్పటిలాగే రొటీన్ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్ల బృందంపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో దుండగులు అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు.

హాస్పిటల్‌కు క్షతగాత్రులు.. చికిత్స ప్రారంభం

కాల్పుల శబ్దాలతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. తోటి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను ఎమర్జెన్సీ వెహికల్స్‌లో సమీపంలోని అనంత్‌నాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్ల బృందం అత్యవసర చికిత్స అందిస్తోంది. జవాన్ల ఆరోగ్య పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Also Read : క్యాన్సర్‌ రోగులకు బిగ్‌ రిలీఫ్‌.. కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గిన ఈ మందుల ధరలు!

హై అలర్ట్.. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం

ఘటన జరిగిన వెంటనే అదనపు భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ఏరియాను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నాయి. పారిపోయిన ముష్కరులను పట్టుకునేందుకు జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. పరిసర గ్రామాలు, అంతర్గత రోడ్లను జల్లెడ పడుతున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అదనపు పికెటింగ్ ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేసేందుకు డ్రోన్లు, పెట్రోలింగ్ టీమ్స్ రంగంలోకి దిగాయి.

ఈ దాడి నేపథ్యంలో కుల్గాం, అనంత్‌నాగ్ జిల్లాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. సీనియర్ పోలీస్, సైనిక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.