అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌నే స్వయంగా క్రమశిక్షణ గుర్తుచేసిన ఓ సాధారణ సైనికుడికి అరుదైన గౌరవం దక్కింది. విధి నిర్వహణలో నిబద్ధత ప్రదర్శించినందుకు గాను ఆ సైనికుడికి ప్రతిష్టాత్మక జాయింట్ సర్వీస్ కమండేషన్ మెడల్ లభించింది. నవంబర్ 11న వెటరన్స్ డే సందర్భంగా అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలోని ‘టూంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్’ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన రక్షణ మంత్రి హెగ్‌సెత్.. తన భార్య, ఇతర అధికారులతో కలిసి ఆ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఫొటోలు దిగారు. ఆ సమయంలో అక్కడ పెద్దగా నవ్వులు వినిపించడంతో.. ఆ ప్రాంత గంభీరతను, ప్రశాంతతను కాపాడాలని అక్కడే విధులు నిర్వహిస్తున్న సైనికుడు థామస్ ఇగ్లేసియాస్ వారిని మర్యాదపూర్వకంగా అప్రమత్తం చేశారు.

దేశంలోనే అత్యంత పవిత్రమైన, గౌరవనీయమైన ఈ స్మారక చిహ్నం వద్ద 1948 నుంచి ‘ది ఓల్డ్ గార్డ్’ సైనికులు నిరంతరం కాపలాగా ఉంటారు. హోదాతో సంబంధం లేకుండా ఆ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడాలని గుర్తుచేసిన ఇగ్లేసియాస్ తీరును పెంటగాన్ తీవ్రంగా అభినందించింది.

హెగ్‌సెత్ స్వయంగా ఆ సైనికుడి యూనిఫామ్‌కు మెడల్ అమర్చి, కరచాలనం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సైనికులంటే ఎంతో గౌరవం, క్రమశిక్షణ ప్రమాణాలు చాలా ముఖ్యం” అని హెగ్‌సెత్ పేర్కొన్నారు. హోదా ఎంత పెద్దదైనా విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షనే ముఖ్యమనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.