ఒడిశా రాజకీయాల్లో ఒక షాకింగ్ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లైవ్ ప్రెస్ మీట్ జరుగుతుండగా, ఒక బీజేపీ ఎమ్మెల్యే తన పక్కనే ఉన్న వ్యక్తిని ముద్దు పెట్టుకుని, కౌగిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

గురువారం ఒడిశాలోని గంజాం జిల్లాలో వరద పరిస్థితులపై మత్స్య, పశు వనరుల శాఖ మంత్రి గోకులానంద మాలిక్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మంత్రి వెనుక చికితీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మనోరంజన్ ద్యాన్ సమంత్రా నిల్చొని ఉన్నారు. 2024 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, తన పక్కనున్న వ్యక్తిని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న విజువల్స్ బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది.

ఈ వీడియోను ప్రతిపక్ష BJD తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. “ఒకవైపు గంజాం జిల్లా వరదల్లో మునిగి ప్రజలు అల్లాడుతుంటే, బీజేపీ నేతలు మాత్రం ఇలా సంబరాల్లో మునిగి తేలుతున్నారు” అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ వివాదంపై అటు ఎమ్మెల్యే గానీ, ఇటు బీజేపీ అధికార ప్రతినిధులు గానీ ఇప్పటివరకు డైరెక్ట్‌గా స్పందించలేదు.

అది AI మాయాజాలం – ఎమ్మెల్యే భార్య కౌంటర్:
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే మనోరంజన్ భార్య మీనా సాహు ఘాటుగా స్పందించారు.
వైరల్ అవుతున్నది పూర్తిగా ఫేక్ వీడియో అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి కావాలనే మార్ఫింగ్ చేశారని ఆమె ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా అదే ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్‌ను ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ అసలైన వీడియోలో ఎమ్మెల్యే మంత్రి ప్రసంగాన్ని ఎంతో సీరియస్‌గా వింటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

తన భర్త ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికే చికితీ నియోజకవర్గ బీజేడీ సోషల్ మీడియా టీమ్ ఈ డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తోందని మీనా సాహు మండిపడ్డారు. ఈ ఫేక్ ప్రచారం వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె బెర్హంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.