
Bengaluru couple : ఐటీ ఉద్యోగాలు వదిలేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించిన బెంగళూరుకు చెందిన ఓ జంట ఇప్పుడు మంచి ఆదాయం సంపాదిస్తోంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎదురైన ఓ సమస్యనే వ్యాపారంగా మార్చుకున్నారు. పని ఒత్తిడి వల్ల ఇంట్లో వంట చేసుకునేందుకు సమయం లేక, బయట ఆహారం తినడం ఇష్టం లేకపోవడంతో ఆరోగ్యకరమైన భోజనం అందించే బిజినెస్ మొదలుపెట్టారు. అలా దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ అనే జంట 2024 సెప్టెంబర్లో ‘వెల్ఫెడ్’ పేరుతో సంస్థను ప్రారంభించింది.
ఈ వ్యాపారం కోసం ఇద్దరూ తమ ఐటీ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రూ.15 లక్షల పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టారు. ఈ డబ్బులో ఎక్కువ భాగం వారి సొంత పొదుపు నుంచే వచ్చింది. మొదట్లో తమ స్నేహితులు, బంధువులకు భోజనం పంపించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇతరులకు కూడా సేవలు అందించడం మొదలుపెట్టారు.
వెల్ఫెడ్లో పప్పు, కూరలు, జొన్న రొట్టెలు, చికెన్, పనీర్, సోయా వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. బిర్యానీలు, ర్యాప్స్ వంటి ఇతర వంటకాలు కూడా ఉన్నాయి. భోజనంలో పోషకాలు సరిగ్గా ఉండేలా ఓ పోషకాహార నిపుణుడి సలహాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, ఒకసారి వాడి పడేసే డబ్బాలకు బదులుగా మళ్లీ ఉపయోగించుకునే స్టీల్ డబ్బాల్లో భోజనం పంపిస్తున్నారు.
ఈ బిజినెస్ మొదటి ఏడాదిలోనే రూ.45 లక్షల ఆదాయం వచ్చింది. ఇక 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం సంపాదించారు. ఇప్పటివరకు 1,500 మందికి పైగా కస్టమర్లకు 55 వేలకుపైగా భోజనాలను అందించారు.
ప్రస్తుతం మూడు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మూడు రోజుల ప్లాన్లో ఒక్కో భోజనం రూ.289, రెండు వారాల ప్లాన్లో రూ.279, నెల రోజుల ప్లాన్లో రూ.269గా ధర నిర్ణయించారు. ఇందులో ఉచిత డెలివరీ, పోషకాహార నిపుణుల సలహాలు కూడా అందిస్తున్నారు. మధ్యలో గ్యాస్ కొరత కారణంగా వంట చేయడంలో ఇబ్బందులు ఎదురైనా వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు బెంగళూరులో మరిన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరించాలని చూస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్లో కూడా ఈ బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు.









