Narendra Modi :  అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత యువ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. యువ ఆటగాళ్ల విజయం ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మోదీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. భారత క్రికెట్‌కు ఇది గొప్ప రోజని, యువ ఆటగాళ్ల ప్రదర్శనపై గర్వంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ 80 పరుగులు చేయగా, ఆర్యవీర్ సెహ్వాగ్ 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో భారత్ కష్టాల్లో పడింది. 42వ ఓవర్‌లో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

ఈ సమయంలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా కీలక ఇన్నింగ్స్ ఆడారు. తొమ్మిదో వికెట్‌కు 57 పరుగులు జోడించి జట్టును విజయానికి దగ్గర చేశారు. మనల్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్‌కు చివరి వికెట్ మాత్రమే మిగిలింది.

అయితే మోహిత్‌కు చివరి బ్యాటర్ సి. వెంకట అండగా నిలిచాడు. వెంకట 8 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 8 పరుగులు కావాల్సి ఉండగా, చివరి బంతికి 3 పరుగులు అవసరమయ్యాయి. పాక్ బౌలర్ అహ్మద్ హుస్సేన్ వేసిన బంతిని మోహిత్ లాంగ్ ఆఫ్ దిశగా బౌండరీకి తరలించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారత జట్టును అభినందించారు. ఆటగాళ్లు చూపించిన పోరాటం, పట్టుదల, క్రీడాస్ఫూర్తి ఎంతో గొప్పవని కొనియాడారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.