IndiGo Flight : ఇండిగో విమానానికి గాల్లోనే సాంకేతిక సమస్య ఎదురైంది. పుణె నుంచి గువాహటికి బయల్దేరిన ఎయిర్‌బస్ A320 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్ లోపం బయటపడింది. విమానం గాల్లోకి వెళ్లిన తర్వాత చక్రాలు లోపలికి ముడుచుకోలేదు. దీంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి పుణెకు తీసుకురావాలని నిర్ణయించారు. విమానంలో సుమారు 200 మంది ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ 15 ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇండిగోకు చెందిన 6E 623 విమానం ఉదయం 7.17 గంటలకు పుణె నుంచి గువాహటికి బయల్దేరింది. టేకాఫ్ అయిన తర్వాత విమానం చక్రాలు లోపలికి వెళ్లడం లేదని పైలట్లు గుర్తించారు. దీంతో ముందుకు ప్రయాణించడం కష్టమని భావించి పుణె ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను సంప్రదించారు.

విమానం బయల్దేరినప్పుడు దాదాపు మూడు గంటల ప్రయాణానికి సరిపడా ఇంధనం ఉంది. అయితే ల్యాండింగ్ గేర్ బయటే ఉండటంతో విమానాన్ని వెంటనే దించకుండా పైలట్లు కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టారు. దాదాపు గంటపాటు పుణె సమీపంలో తిరిగారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. విమానంలో ఎక్కువ ఇంధనం ఉన్నప్పుడు వెంటనే కిందికి దించితే విమానం బరువు ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంత ఇంధనాన్ని ఖర్చు చేసి విమానం బరువును తగ్గించారు. ఇలా చేయడం వల్ల సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి వీలవుతుంది.

విమానం ల్యాండ్ అయ్యే ముందు పైలట్లు మరో జాగ్రత్త తీసుకున్నారు. పుణె విమానాశ్రయంలోని రన్‌వే పైనుంచి విమానాన్ని తక్కువ ఎత్తులో నడిపారు. ఈ సమయంలో విమానం చక్రాలు బయటకు వచ్చాయా? అవి సరిగ్గా ఉన్నాయా? అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు కళ్లతో పరిశీలించారు.విమానం లోపల ఉన్న సూచనలు కొన్నిసార్లు తప్పుగా చూపించే అవకాశం ఉంటుంది. అందుకే చక్రాలు బయటకు వచ్చాయని మరోసారి నిర్ధారించుకున్న తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. చివరకు ఉదయం 9 గంటల తర్వాత విమానం పుణె విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది.

ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య గుర్తించడంతో 6E 623 విమానాన్ని తిరిగి పుణెకు తీసుకొచ్చి సురక్షితంగా దించినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఆ విమానాన్ని సాంకేతిక నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాతే తిరిగి విమాన సేవల్లోకి తీసుకొస్తామని సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు భోజనం, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అవసరాన్ని బట్టి మరో విమానంలో ప్రయాణించే అవకాశం, టికెట్ డబ్బుల తిరిగి చెల్లింపు వంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.