
Uttara Pradesh : ఉత్తరప్రదేశ్లో ఓ 80 ఏళ్ల వృద్ధుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన 13వ రోజు కుటుంబ సభ్యులు నిర్వహించే కార్యక్రమాన్ని ఆయన బతికుండగానే చేసుకున్నారు. అంతేకాదు.. ఏకంగా 900 మందికి భోజనాలు కూడా పెట్టించారు. తనకు కొడుకు లేడని, తన తర్వాత కూతురిపై ఎలాంటి భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లా, బరౌత్ తహసీల్ పరిధిలోని జోహ్రీ గ్రామంలో బల్జోర్ సింగ్ అనే 80 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నారు. ఆయనకు ఒక్క కూతురు మాత్రమే ఉంది. కొడుకు లేకపోవడంతో తన మరణం తర్వాత కుటుంబ సంప్రదాయాల ప్రకారం జరిగే కార్యక్రమాల బాధ్యత కూతురిపై పడుతుందని ఆలోచించారు. అందుకే తాను బతికుండగానే తన 13వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 13వ రోజు తెహ్రవీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోమం చేస్తారు. బంధువులు, గ్రామస్తులకు భోజనాలు పెడతారు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కొడుకులు నిర్వహిస్తుంటారు. అయితే బల్జోర్ సింగ్ మాత్రం ఈ కార్యక్రమాన్ని తనకు తానే చేసుకున్నారు. ఆదివారం సంప్రదాయం ప్రకారం హోమం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, బంధువులు కలిపి సుమారు 900 మందికి భోజనాలు పెట్టారు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడిగితే బల్జోర్ సింగ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. తనకు కొడుకు లేడని, ఒక్క కూతురు మాత్రమే ఉందని తెలిపారు. తన మరణం తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఆమె చూసుకోవాల్సి వస్తుందని, ఆమెపై భారం వేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. నాకు కొడుకు లేడు. నా తర్వాత నా కూతురు ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ పనిని నేను బతికుండగానే చేసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా జరిగింది. తన పదేళ్ల మనవడు ముకుల్కు బల్జోర్ సింగ్ తలపాగా కట్టారు. తన తర్వాత కుటుంబ బాధ్యతలను మనవడు చూసుకోవాలని ఈ విధంగా సూచించారు. తనకు ఒక కూతురు మాత్రమే ఉందని, ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారని బల్జోర్ సింగ్ చెప్పారు. తనకున్న రెండు బీఘాల భూమిని ఇప్పటికే మనవడికి ఇచ్చినట్లు వెల్లడించారు.









