ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్‌ ఆమె.. ఒక్కసారి తనతో డేటింగ్‌కు వెళ్లాలని వేల మంది అబ్బాయిలు కలలు కన్నారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి లక్షల మంది ప్రయత్నించారు. సోషల్ మీడియాలో ఆమె ఫొటో పెడితే చాలు.. లైకులు, కామెంట్లతో హోరెత్తిపోతుంది. ఎక్కడికి వెళ్లినా లగ్జరీ లైఫ్. ఖరీదైన హోటళ్లు.. అందమైన ప్రదేశాలు.. కోట్ల మంది కలలు కనే జీవితం ఆమెది. కానీ అలాంటి అమ్మాయి ఇప్పుడు అమెరికాలోని ఓ డిటెన్షన్ సెంటర్‌లో చిక్కుకుంది. ఖరీదైన దుస్తులు వేసుకునే ఆమెకు ఇప్పుడు సాధారణ ఖైదీల దుస్తులే దిక్కయ్యాయి. స్టార్ హోటళ్లలో ఉండే ఆమె.. ఇప్పుడు పన్నెండు మందితో కలిసి ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. అసలు ఇంత ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిని అమెరికా అధికారులు ఎందుకు అరెస్ట్ చేశారు?

ఆమె పేరు వెరా డిజ్క్‌మాన్స్. నెదర్లాండ్స్‌కు చెందిన 29 ఏళ్ల మోడల్. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అందమైన ఫొటోలు, వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఓన్లీఫ్యాన్స్‌లో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే వెరాకు ఇంత పేరు రావడానికి ఆమె అందం ఒక్కటే కారణం కాదు. కొన్నేళ్ల కిందట తనకు సరైన బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ ఓ ప్రకటన చేసింది. తనతో డేటింగ్ చేయాలనుకునే అబ్బాయిల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్స్ తీసుకుంది. ఆమెతో డేటింగ్ చేయడానికి వేలల్లో ఆసక్తి చూపించారు. అప్పటినుంచి ఆమెకు ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ అనే పేరు వచ్చింది.

వెరా కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. మియామీ నగరంలో ఉంటూ తన మోడలింగ్, సోషల్ మీడియా పనులు చూసుకుంటోంది. నవంబర్ 11న ఆమె న్యూయార్క్ వైపు బయలుదేరింది. అక్కడి మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగే UFC ఈవెంట్‌కి వెళ్లాలనుకుంది. ఫైటర్లతో కలిసి కంటెంట్ కూడా చేయాలనుకుంది. మియామీ నుంచి విమానంలో న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎయిర్‌పోర్టులో ఆమె కోసం ఇమిగ్రేషన్ అధికారులు ఎదురుచూస్తున్నారు. వెరా వచ్చాక అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చేతులకు బేడీలు వేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత వెరా ఉండాల్సింది ఖరీదైన హోటల్లో కాదు.. డెలానీ హాల్ అనే ఓ నిర్బంధ కేంద్రంలో అని తీసుకెళ్లారు.

లక్షలాది అభిమానులు ఉన్న అమ్మాయి.. ఒక్కసారిగా తనకు ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది. తన ఫోన్‌తో వీడియోలు చేస్తూ ప్రపంచమంతా తిరిగే వెరాకు.. ఇప్పుడు కుటుంబంతో మాట్లాడటమే కష్టంగా మారింది. బయటికి వెళ్లే స్వేచ్ఛ లేదు. నచ్చిన ఫుడ్‌ తినే ఛాన్స్ లేదు. తనకు అలవాటైన జీవితానికి పూర్తిగా దూరమైంది. వెరాను నిర్బంధించిన గదిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. ఒకే గదిలో వెరాతో పాటు మరో పన్నెండు మంది మహిళలు ఉన్నారని.. సరిపడా ఆహారం, మంచినీళ్లు కూడా అందడం లేదని చెబుతోంది. ఆ గదిలోకి స్వచ్ఛమైన గాలి కూడా రావడం లేదని వెరా కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

తల్లి స్కోల్ట్ తన కూతురు వెరాను చూడటానికి నిర్బంధ కేంద్రానికి వెళ్లింది. అక్కడ వెరాను చూసి షాక్‌కు గురైంది. ఎప్పుడూ అందంగా తయారై కనిపించే వెరా.. ఖైదీల దుస్తుల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించడంతో తల్లి స్కోల్ట్‌ ఆవేదన వ్యక్తంచేసింది. ఆ సమయంలో తన కూతురిని గుర్తుపట్ట లేకపోయానని అంటోంది. అంతేకాదు.. మొదట్లో ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉండేదని, తర్వాత కేవలం ఐదు నిమిషాలకే పరిమితం చేశారని ఆరోపించింది. తన కూతురు ఎప్పుడు బయటికి వస్తుందో తెలియడమే లేదని తల్లి స్కోల్ట్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సోషల్ మీడియాలో ఎంతోమందితో మాట్లాడే వెరా.. ఇప్పుడు తన తల్లితో ఐదు నిమిషాలు మాట్లాడటానికి కూడా ఎదురుచూడాల్సి వస్తోంది.

అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. వెరా ఏమైనా పెద్ద నేరం చేసిందా? ఎవరినైనా మోసం చేసిందా? అమెరికాలో ఏదైనా గొడవలో చిక్కుకుందా? ఇంతకీ పోలీసులు ఆమెను ఎందుకు పట్టుకున్నారు? మొదట్లో వెరా కుటుంబానికి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అమెరికా అధికారులు ఎందుకు తీసుకెళ్లారో తమకు తెలియదని ఆమె తల్లి చెప్పింది. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అసలు కారణం బయటపెట్టింది. వెరా చేసిన తప్పులు బయటపెట్టింది. ఇక్కడే మనకు మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుస్తోంది. వెరా అమెరికాలో చిక్కుకోవడానికి కారణం ఒక్క రోజులో జరిగిన ఇష్యూ కాదు. దీని వెనుక కొన్ని సంవత్సరాల కథ ఉంది.

వాస్తవానికి వెరాకు 2019లోనే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులతో సమస్య ఎదురైంది. హ్యూస్టన్ ఎయిర్‌పోర్టు ద్వారా తమ దేశంలోకి రావడానికి ప్రయత్నించిందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో ఆమెను వెనక్కి పంపించేశారు. అలాగే 2024 ఆగస్టులోనూ వెరా మళ్లీ అమెరికా వెళ్లింది. ఈసారి వెరాకు అమెరికాలో తాత్కాలికంగా ఉండేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. అయితే, గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడంతో 2025 ఆగస్టులో ఆమెను దేశం నుంచి పంపించే ప్రక్రియ మొదలైంది.

ఈ ప్రాసెస్‌ కొనసాగుతుండగా 2026 మే 26న అమెరికా ఇమిగ్రేషన్ కోర్టుకు వెరా వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు ఆమె కోర్టుకు వెళ్లలేదు. ఆమె తరఫున లాయర్ కూడా హాజరు కాలేదు. దీంతో వెరాను అమెరికా నుంచి పంపించాలని జడ్డి ఆదేశాలు జారీచేశారు. అందుకే నవంబర్ 11న నెవార్క్ ఎయిర్‌పోర్టులో అధికారులు వెరాను అదుపులోకి తీసుకున్నారని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఆమెను అమెరికా నుంచి పంపించే వరకు తమ అదుపులోనే ఉంచుతామని కూడా స్పష్టం చేసింది.

మరి ఇంత ముఖ్యమైన కోర్టు విచారణకు వెరా ఆ రోజు ఎందుకు వెళ్లలేదు? ఆమె తల్లి చెప్పిన కారణం వింటే మరో విషయం అర్థమవుతుంది. వెరా ఎప్పుడూ ఒకే చోట ఉండదు. షూటింగులు, ప్రయాణాలు, ఇతర పనుల కోసం హోటళ్లు మారుతూ ఉంటుంది. దీంతో కోర్టు నుంచి వచ్చిన నోటీసు వెరాకు అందలేదన్నది తల్లి మాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. నిజంగానే నోటీసు అందలేదా? లేక అందినా వెరా పట్టించుకోలేదా? ఈ విషయంలో అమెరికా అధికారులు, వెరా కుటుంబం మాటలు వేర్వేరుగా ఉన్నాయి.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. వెరా అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంది. గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి ఇచ్చే అనుమతి. గ్రీన్‌ కార్డు పొందితే అమెరికాలో హ్యాపీగా ఉండొచ్చు. అయితే వెరా దగ్గర ఉన్నది కేవలం బీ-2 టూరిస్ట్ వీసా మాత్రమే. టూరిస్ట్ వీసాతో అమెరికా వెళ్లినవాళ్లు అక్కడ ఉద్యోగం చేయడానికి అనుమతి ఉండదు. మరి సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించే వెరా అక్కడ ఏం చేసింది? ఆమె మోడలింగ్ పనులకు ప్రత్యేక అనుమతి ఉందా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఫాలోవర్లు ఉన్నా.. అమెరికా చట్టాల ముందు ఆ ఫాలోయింగ్ ఉపయోగపడలేదు. ఆమె ఎంత పెద్ద సోషల్ మీడియా స్టార్ అయినా సరే.. ఇమిగ్రేషన్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు వెరా కుటుంబం మాత్రం ఆమెను ఇలా నిర్బంధించడం సరికాదని అంటోంది. అవసరమైతే నెదర్లాండ్స్‌కు వెంటనే తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని తల్లి చెబుతోంది. మరోవైపు ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తున్నామని నెదర్లాండ్స్ ప్రభుత్వం తెలిపింది.

వెరా దగ్గర డబ్బు ఉంది. పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాను వెళ్లాలనుకున్న దేశానికి వెళ్లేంత ఆర్థిక స్థోమత ఉంది. కానీ ఒక్క ఇమిగ్రేషన్ సమస్యతో ఆమె జీవితం తలకిందులైంది. ఎప్పుడూ కెమెరాల ముందు నవ్వుతూ కనిపించే అమ్మాయి.. ఇప్పుడు నిర్బంధ కేంద్రంలో కన్నీళ్లు పెట్టుకుంటోంది. నిన్నటివరకు తనతో డేటింగ్ చేయడానికి ఎవరు అర్హులో నిర్ణయించిన వెరా.. ఇప్పుడు తనను అమెరికా నుంచి ఎప్పుడు పంపిస్తారో తెలియని దుస్థితిలో ఉంది.

మొత్తానికి ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్‌గా పేరు తెచ్చుకున్న వెరా డిజ్క్‌మాన్స్.. ఇప్పుడు అమెరికా నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురుచూస్తోంది. ఆమెకు లక్షల మంది అభిమానులు ఉండొచ్చు. కోట్ల రూపాయల సంపాదన ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఆమె కోరుకుంటున్నది మాత్రం ఒక్కటే.. తన కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా జీవించడం. మరి అమెరికా అధికారులు వెరాను ఎప్పుడు నెదర్లాండ్స్‌కు పంపిస్తారనేది చూడాలి.