దేశంలోని పౌల్ట్రీ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ కీలక ముందడుగు వేసింది. భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ICAR-NIHSAD) శాస్త్రవేత్తలు దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 20న భోపాల్‌లో ఈ టీకాను జాతికి అంకితం చేయనున్నారు.

భారత్‌లో కోళ్ల ఫారాలలో తరచూ వచ్చే బర్డ్ ఫ్లూ అవుట్‌బ్రేక్స్‌కు ప్రధాన కారణమైన ‘క్లేడ్ 2.3.2.1a’ రకం H5N1 స్ట్రెయిన్‌ను ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు మన దేశంలో ఈ నిర్దిష్ట స్ట్రెయిన్‌ను అరికట్టే కమర్షియల్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, ఈ ఆవిష్కరణ పౌల్ట్రీ రంగానికి పెద్ద ఊరటనివ్వనుంది.

బర్డ్ ఫ్లూ సోకితే కోళ్లలో మరణాల రేటు దాదాపు 100 శాతానికి చేరుతుంది. దీనివల్ల రైతులకు భారీ ఆర్థిక నష్టం కలగడమే కాకుండా, గ్లోబల్ ట్రేడ్ మరియు పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉదాహరణకు, 2006లో వచ్చిన బర్డ్ ఫ్లూ కారణంగా దేశానికి రూ. 2,200 నుండి 3,000 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.

మరోవైపు, ఈ వైరస్ కేవలం పక్షులకే కాకుండా పబ్లిక్ హెల్త్‌కు కూడా ముప్పుగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2003 నుండి భారత్ సహా 25 దేశాల్లో 1,003 మంది మనుషులకు ఈ వైరస్ సోకగా, 479 మంది మరణించారు. ఇటీవల క్లేడ్ 2.3.2.1a స్ట్రెయిన్ క్షీరదాలతో పాటు మూడు హ్యూమన్ కేసులలో కూడా బయటపడింది.

ఈ నేపథ్యంలో కోళ్ల నుండి ఇతర జంతువులకు, మనుషులకు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మరియు రైతుల జీవనోపాధిని కాపాడటానికి ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకం కానుంది. అయితే, నవంబర్ 20న దీనిని ఆవిష్కరించనున్నప్పటికీ, కమర్షియల్ మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.