Varanasi Glimpse: వరల్డ్ స్టేజ్‌పై “వారణాసి” అడుగు.. గ్లోబల్ గ్లింప్స్ రెడీ!

Varanasi Glimpse: తెలుగు సినిమా మరోసారి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి గురించి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.

“Varanasi to the World” అనే ప్రత్యేక గ్లింప్స్‌ను మెక్సికోలో జరగనున్న CCXP Mexico 2026 ఈవెంట్‌లో ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి 26 వరకు జరిగే ఈ కార్యక్రమంలో టీజర్, ట్రైలర్ కాకుండా, గ్లోబల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను చూపించనున్నారు.

ఈ గ్లింప్స్‌లో ఇప్పటివరకు బయటకు రాని బిహైండ్ ది సీన్స్ ఫుటేజ్, సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు, అలాగే కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా సినిమా మీద మరింత ఆసక్తి పెరగనుంది.

ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు నటిస్తుండగా, హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. అలాగే విలన్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత కె. ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.

షూటింగ్ పనులు కొనసాగుతున్నప్పటికీ, ఈ ఈవెంట్ సందర్భంగా రాజమౌళి వీడియో ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన కుమారుడు కార్తికేయ అక్కడి ఏర్పాట్లను చూసుకుంటున్నారని సమాచారం.

భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా IMAX ఫార్మాట్‌లో విడుదల కానుంది. మొత్తంగా ‘వారణాసి’ సినిమా ద్వారా తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు.